నీళ్ల బోరు నుంచి గ్యాస్ మంటలు

నీళ్ల బోరు నుంచి  గ్యాస్ మంటలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు  మండలం శివకోడు లోని ఆక్వా చెరువు సమీపంలో ఓఎన్జీసీ పైపు నుంచి భారీగా గ్యాస్ లీకయింది.  గ్యాస్ లీకవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే గ్యాస్ లీకేజీపై ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు (వార్తరాసే సమయానికి) యత్నిస్తున్నారు. 

మంటలు ఎక్కువగా వ్యాపించకుండా వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ( వార్త రాసే సమయానికి)  చేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన వెంటనే గ్యాస్‌ లీక్‌పై ఓఎన్జీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  సంఘటన స్థలానికి మూడు వైపులా ఓఎన్జీసీని ఆన్ షోర్ బావులను మూసివేశారు. ఈ గ్యాస్ లైన్ నివాస స్థలాలకు దూరంగా ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 

ALSO READ :మొక్కల కోసం తవ్వుతుంటే పొగలు వస్తున్నాయి..వీడియో వైరల్

బోరుబావిలోంచి గ్యాస్ రావడానికి గల కారణాలు పరిశీలించారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో గ్యాస్‌ కోసం గతంలో సెస్మిక్‌ సర్వే జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆక్వా చెరువుల్లో నీటి కోసం అదే చోట 6 ఏళ్ల కిందట బోరు వేయగా.. రెండు రోజుల కిందట ఈ బోరును మరింత లోతుకు తవ్వారని తెలుస్తోంది. ప్రస్తుతం గ్యాస్ లీకవడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతుండటంతో అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బందికి ( వార్తరాసేసమయానికి) కష్టంగా మారింది. దీంతో మంటలను ఎలా ఆర్పాలన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. గ్యాస్ లీక్‌ అవడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఉదృతంగా ఎగసిపడుతున్న మంటలను చూసి ఆందోళన చెందుతున్నారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో కోనసీమ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి లీకేజీలులేకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు ఓఎన్జీసీ ని కోరుతున్నారు.