మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ఇల్లు, యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో ఐటీ సోదాలు ఉదయం నుంచి కంటిన్యూ అవుతున్నాయి. 15 గంటలకు పైగా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు . హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో 50 చోట్ల ఐటీశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కూతురు, కొడుకులు, అల్లుళ్ల నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్లు, బంధువులు, సన్నిహితుల ఇండ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

మంత్రి మల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంటిలో సోదాలు కటిన్యూ చేస్తున్నారు. కొంపల్లిలో సంతోష్ రెడ్డి ఇంటికి ఉదయం వెళ్లారు ఐటీ ఆఫీసర్లు. కానీ లోపట్నుంచి లాక్ చేసుకున్న ఇంటి సభ్యులు మధ్యాహ్నం వరకు తలుపులు తీయలేదు. దీంతో డోర్లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించటంతో మధ్యాహ్నం తెరిచారు. సంతోష్ రెడ్డి ఇంటిలో సోదాలను కీలకంగా భావిస్తున్నారు ఐటీ అధికారులు. మరోవైపు మల్లారెడ్డి సన్నిహితులు రఘునందన్ రెడ్డి, త్రిశూల్ ఇళ్లలో సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. రఘునందన్ రెడ్డి, త్రిశూల్ ఇళ్లలో 4 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. 

మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదు సీజ్ చేశారు ఐటీ అధికారులు. ఉదయం నుంచి త్రిశూల్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతున్నారు.  మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాల్లో సేకరించిన సమాచారంతో అధికారులు క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ ఇంట్లో తనిఖీలు చేశారు. బాలానగర్ రాజు కాలనీలోని క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లో సోదాలు చేశారు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ను క్రాంతి బ్యాంక్ లో గుర్తించి సోదాలు చేసినట్లు తెలిసింది.

అటు సోదాలతో ఉదయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు కుటుంబ సభ్యులెవరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన మల్లారెడ్డి.. కార్యకర్తలకు అభివాదం చేశారు. దీంతో మల్లారెడ్డికి అనుకూలంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.