గ్రూప్–1 మెయిన్స్​కు అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న నిరసనలు

గ్రూప్–1 మెయిన్స్​కు అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న నిరసనలు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 మెయిన్స్​కు అభ్యర్థుల ఎంపికపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రిలిమ్స్ నుంచి మెరిట్ ఆధారంగా కాకుండా రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను పికప్ చేయడంతో లిస్టులో పేర్లు లేని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 503 గ్రూప్–1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్​ లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 3,80,204 మంది అప్లై చేసుకున్నారు. అక్టోబర్ 16న  జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్ కు 2,85,916 మంది అటెండ్ అయ్యారు. వీటి ఫలితాలను జనవరి 13న టీఎస్​పీఎస్సీ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్​లో పేర్కొన్నట్టుగానే  మల్టీజోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్​కు ఎంపిక చేశారు. అయితే, ఈ విధానం వల్ల చాలామంది మెరిట్ అభ్యర్థులు ఎంపిక కాలేదు. పలు కేటగిరీల్లో 74 మార్కులు పొందిన అభ్యర్థులూ మెయిన్స్​ కు అర్హత పొందలేదు. కానీ, వారి కంటే తక్కువ మార్కులొచ్చిన వారు క్వాలిఫై అయ్యారు. టాలెంట్ ఆధారంగా ఎంపిక చేయాల్సిన ప్రిలిమినరీ ఎగ్జామ్​ లో రిజర్వేషన్ల అమలుతో నష్టపోయామని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. కొన్ని కేటగిరీల్లో 58, 60 మార్కులు పొందిన వారూ క్వాలిఫై కావడంతో, కఠినమైన పరీక్ష రాసి 70 మార్కులు సాధించిన తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చెందుతున్నారు. ఏపీలో మాత్రం మెరిట్ ఆధారంగా 1:50 ఆధారంగానే ఎంపిక చేశారని గుర్తుచేస్తున్నారు. తెలంగాణలో కనీసం 1:100 రేషియోలో మెయిన్స్​కు ఎంపిక చేస్తే, కొంత ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు.

ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులు

నోటిఫిషన్​లో పేర్కొన్న విధానంలోనే మెయిన్ ఎగ్జామ్​కు అభ్యర్థులను పికప్ చేశామని అధికారులు చెప్తున్నారు. అయితే, దీనిపై అభ్యర్థులు కమిషన్ అధికారులతో సర్కారు పెద్దలు, ప్రతిపక్ష లీడర్లను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. ఎవరి నుంచీ సరైన స్పందన లేకపోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చ జరిగింది. పలువురు సభ్యులు కూడా 1:100 రేషియోలో మెయిన్స్​​కు ఎంపిక చేయాలని కోరగా, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఎమ్మెల్యేల సూచనను పరిశీలించి, టీఎస్​పీఎస్సీకి ప్రతిపాదిస్తామని తెలిపారు. ఆ తర్వాత కమిషన్ అధికారులకు ప్రభుత్వం తరఫున సూచన చేశారా? లేదా? అనే దానిపై అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం చేయాలె

‘‘12 ఏండ్ల తర్వాత వచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్ ను ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇచ్చారు. ప్రిలిమినరీ పరీక్షలో రిజర్వేషన్లు అమలు సరికాదు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల్లో మెరిట్ మార్కులు పొందిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ కఠినంగా రావడంతో 2004లో ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని 1:100 రేషియోలో చాన్స్ ఇచ్చారు. ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులోనూ ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు. అలాగే గ్రూప్–1 అభ్యర్థులకు మెయిన్స్​ కు ఎంపిక చేయాలి” అని అభ్యర్థులు కోరుతున్నారు.