- రూ.644.31 కోట్ల విలువైన 2,69,699 మెట్రిక్ టన్నులు సేకరణ
- రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.578 కోట్లు జమ
- బోనస్ రూపంలో రూ.68.33 కోట్లు చెల్లింపు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 47,303 మంది రైతులనుంచి రూ.644 కోట్ల విలువైన 269,699 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ సీజన్ లో 331 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 155, డీఆర్డీఏ ఆధ్వర్యంలో 134, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో 34, మెప్మా ఆధ్వర్యంలో 8 కేంద్రాలను నెలకొల్పారు. అయితే వీటిలో308 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరిగాయి.
ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించడంతో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను కూడా ట్యాబ్ ఎంట్రీ చేసిన మూడ్రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. 41,375 మంది రైతులకు చెందిన 2,41,983 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.578 కోట్లు చెల్లించారు. కొనుగోలు చేసిన మొత్తంలో 90 శాతం డబ్బులు ఇప్పటికే రైతులకు చెల్లించామని, మిగిలినవి కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తున్నామని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు.
వెంటనే బోనస్ చెల్లింపులు..
ధాన్యం కొనుగోళ్లు జరిపిన వెంటనే సన్నాలు అమ్మిన రైతులకు బోనస్ డబ్బులను బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తున్నారు. క్వింటాకు రూ.500 చొప్పున 38,668 మంది రైతులకు రూ.114.01 కోట్లు చెల్లించాల్సి ఉండగా, 22,083 మంది రైతులకు రూ.68.33 కోట్లు బ్యాంకు అకౌంట్లలో జమచేశారు. ఇంకా 16,585 మంది రైతులకు రూ.45.67 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది.
జిల్లాలో అత్యధికంగా కల్లూరు మండలంలో 8,160 మంది రైతులు, వెంసూరులో 6,770, పెనుబల్లిలో 4,902, తల్లాడలో 4,241, సత్తుపల్లిలో 2,374, కూసుమంచిలో 2,627, నేలకొండపల్లిలో 2,491, ముదిగొండలో 1,570, వైరాలో 1,980 మంది రైతులు బోనస్ ను ఉపయోగించుకొని లబ్ధిపొందారు. మరోవైపు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 187 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి లక్షా 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 14 వేల మంది రైతుల వద్ద నుంచి ఇప్పటి వరకు 84,620 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిపారు.
ఒకట్రెండు వారాల్లో కొనుగోళ్లు పూర్తి..
ఈ ఏడాది వానాకాలంలో 3.69 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కొనుగోళ్ల ప్రారంభంలోనే వర్షాలకు భయపడి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు పచ్చి వడ్లనే అమ్ముకోవడంతో కొంత కొనుగోళ్లు తగ్గాయి. మరోవైపు ఈ ఏడాది అధిక వర్షాలు, వరదలతో పంట నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. పంటకు తెగుళ్లు సోకడం వల్ల కూడా దిగుబడి తగ్గిందంటున్నారు. అయితే జనవరి నెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. మధిర, వైరా నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో ఇంకా వరి పంట మిగిలి ఉందని, ఒకట్రెండు వారాల్లో పూర్తి స్థాయిలో వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
