ఉల్లిగడ్డ సాల్తలే : పండేది తక్కువ.. వాడేది ఎక్కువ

ఉల్లిగడ్డ సాల్తలే : పండేది తక్కువ.. వాడేది ఎక్కువ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగురాష్ట్రంలో అవసరాలకు ఉల్లిగడ్డ సాల్తలేదు. సాగవుతున్న ఉల్లి కంటే వాడకం అధికంగా ఉండడంతో మహారాష్ట్ర, కర్నాటకల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా తాండూరు, మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా నారాయణఖేడ్‌‌‌‌‌‌‌‌, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌, అలంపూర్‌‌‌‌‌‌‌‌, నల్గొండ తదితర ప్రాంతాల్లోనే కొంత మేర ఉల్లి వేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌, అక్టోబర్ నెలల్లోనే రాష్ట్రంలో ఉల్లి దిగుబడి వస్తుంది. నవంబర్ నుంచి మార్చి వరకు కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఉల్లి రావాల్సిందే. దేశంలోనే అతిపెద్ద మార్కెట్‌‌‌‌‌‌‌‌ అయిన నాసిక్‌‌‌‌‌‌‌‌లోని లాసల్వ్ నుంచి రోజూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు ఉల్లి తీసుకొస్తున్నారు. ఇక్కడి  నుంచి జిల్లాలకు వెళ్తోంది.

సిటీలో రోజూ10 వేల క్వింటాళ్లు వాడకం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉల్లికి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువ. రోజువారీగా మలక్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌కు 60 వేల నుంచి 70 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వస్తుండగా వాటిలో 10 వేల క్వింటాళ్లు నగర అవసరాలకే సరిపోతుందని మార్కెట్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి అనంతయ్య చెప్పారు.  2018-–19లో మలక్‌‌‌‌‌‌‌‌పేట మార్కెట్‌‌‌‌‌‌‌‌కు 28 లక్షల 66 వేల 702 క్వింటాళ్ల ఉల్లి వచ్చిందని రూ.203 కోట్ల 25 లక్షల వ్యాపారం జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ లేకనే..

రాష్ట్రంలో ఉల్లి సాగుకు అనువైన వాతావారణమే ఉంది. కానీ సరైన ప్రోత్సాహం, గైడెన్స్‌‌‌‌‌‌‌‌ లేక రైతులు ఉల్లివైపు చూడడం లేదు. ఉల్లిగడ్డల నిల్వకు కోల్డ్ స్టోరేజీలు లేక రైతులు నష్టపోతున్నారు. గతంలో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉల్లి నిల్వకు ప్రత్యేక గోదాములున్నా ఇప్పుడు వాటిని మూసేశారు. ఈ ఏడాది కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌, అలంపూర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాల్లోనూ ఉల్లి అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. దీంతో రానున్న రోజుల్లో ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉంది.