- నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించిన సీఐడీ
- ఒక్కో ఏజెన్సీ నుంచి ఎంత డబ్బు తీసుకున్నరని క్వశ్చన్
- బిగ్‌బాస్ ఫేం సిరి హనుమంతునూ ఎంక్వైరీ
- నేడు విచారణకు హాజరుకానున్న నటుడు ప్రకాశ్ రాజ్
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో సీఐడీ సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సినీ నటుడు విజయ్ దేవరకొండ, బిగ్‌బాస్ ఫేం సిరి హనుమంతును మంగళవారం విచారించింది. ‘బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రచారం చేశారు? దీని కోసం ఎంత తీసుకున్నారు?’అంటూ సీఐడీ అధికారులు ప్రశ్నించారు. సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియదా? అంటూ నిలదీశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ నటులు, యూట్యూబర్లకు సీఐడీ సిట్ నోటీసులు జారీ చేసింది. సీఐడీ నోటీసుల మేరకు వీరిద్దరూ లక్డీకాపూల్‌లోని సీఐడీ ఆఫీస్‌లో మంగళవారం విచారణకు హాజరయ్యారు. విజయ్ దేవరకొండను అధికారులు గంటకుపైగా ప్రశ్నించారు. అగ్రిమెంట్లు, యాప్స్ నిర్వాహకుల నుంచి అందిన డబ్బుకు సంబంధించిన వివరాలను రాబట్టారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ, హనుమంతును విడివిడిగా విచారించి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారు.
తప్పని తెలీదా?
ప్రధానంగా బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో పాల్గొనడానికి దారి తీసిన కారణాలు, అందుకు సంబంధించి నగదు లావాదేవీలపై ప్రశ్నించారు. ప్రమోట్ చేసిన కంపెనీ ప్రతినిధులతో జరిగిన ఒప్పందాలను పరిశీలించారు. బెట్టింగ్ యాప్‌ల వైపు ప్రోత్సహించేలా యాడ్స్ చేయడం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గుర్తించారా..? అంటూ ప్రశ్నించినట్టు ప్రశ్నించింది. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు విజయ్ దేవరకొండ సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ఆయన తెలిపిన వివరాలతో పాటు ఇప్పటికే సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా సీఐడీ అధికారులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. కాగా, ఇదే కేసు దర్యాప్తులో భాగంగా సైతం సీఐడీ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు భారీగా పారితోషికం తీసుకున్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల అంశంపైనే ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలిసింది. గోవిందా 365 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన సిరి హనుమంతును అందుకు సంబంధించిన వివరాలు అడిగినట్టు సమాచారం.
నేడు సీఐడీ ముందుకు నటుడు ప్రకాశ్‌రాజ్
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సైతం ఇప్పటికే సమన్లు జారీ చేశారు. కీలక సమాచారం సేకరించాల్సి ఉన్నందున తమ ఎదుట హాజరుకావాలని సీఐడీ అధికారులు సూచించారు. సీఐడీ అధికారుల సమన్ల మేరకు నటుడు ప్రకాశ్‌రాజ్ బుధవారం ఉదయం సీఐడీ విచారణకు హాజరుకానున్నట్టు సమాచారం.
