
- డబుల్ లాభాలు వస్తాయని కోట్లు కొట్టేశారు
- రెండు నెలల పాటు ఇచ్చి
- మూడో నెల నుంచి ముంచిన్రు
- ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోనే వెయ్యి మంది బాధితులు
- వాట్సాప్‌లో చాటింగ్..
- ఫోన్‌పే, గూగుల్‌పేతో పేమెంట్
- రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది బాధితులు
వనపర్తి, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్త తరహా ఆన్లైన్మోసం వెలుగు చూసింది. ‘సోలార్ గోల్డ్ కోట్’ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడితే నెల నెలా లాభాలు వస్తాయని చెప్పి రూ.కోట్లు ముంచారు. కేవలం ఫోన్లు మాత్రమే చేస్తూ పెట్టుబడిదారులంటూ పెద్ద పెద్ద పేర్లు చెప్పి...కంపెనీకి వచ్చే లాభాల నుంచి డబ్బులు ఇస్తామని చెప్పి ఒప్పించారు. దీని కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేశారు. ఒకటి రెండు నెలల పాటు అకౌంట్లలో డబ్బులు జమవుతుండటంతో తమ పంట పండిందని బాధితులు భ్రమపడ్డారు. వీరిని చూసి మరికొంతమంది పెట్టుబడులు పెట్టారు. ఇలా వేల సంఖ్యలో సభ్యులు చేరడంతో కంపెనీ బోర్డు తిప్పేసింది. రెండు, మూడు రోజులుగా వెబ్సైట్ఓపెన్కాకపోవడం, ఫోన్లు స్విచ్ఛాఫ్వస్తుండడం, ఎలాంటి సమాచారం రాకపోవడంతో మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు.
భారత ప్రభుత్వ అనుమతి ఉందంటూ..
సోలార్ గోల్డ్ కోట్ మోసాలు రాష్ట్రవ్యా ప్తంగా ఉన్నప్పటికీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోనే వెయ్యి మందికి పైగా బాధితులు ఉండి ఉంటారని అంచనా. కొన్ని నెలల కింద కొంతమందికి ఫోన్లు చేసిన చీటర్స్ తమ బిజినెస్ ఎలా నడుస్తుందో వివరించారు. www.solar --goldcoat.cc, www.solar--goldcaot.com వెబ్సైట్లలో కంపెనీ వ్యాపార వివరాలు ఉన్నాయని నమ్మబలికారు. తమ సోలార్‌పవర్ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వ అనుమతి ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వీరు పంపే ఆన్లైన్ లింక్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వగానే పేరు, వివరాలు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ఐడీ, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. బిజినెస్ యాక్టివ్ కావాలంటే వారి దగ్గర ఉన్న ప్లాన్లలో ఏదో ఒకటి తీసుకోవాలి. తమ దగ్గర రూ.600 నుంచి రూ. లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చని, డబ్బులను ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తే చాలని నమ్మించారు. వీరి ప్లాన్‌లో భాగంగా 30 వాల్టుల సోలార్ప్యానల్లో రూ.400 పెట్టుబడి పెడితే 45 రోజుల్లో రూ.648 చెల్లించారు. 70 వాల్టుల సోలార్ ప్యానల్లో రూ.1100 కడితే 50 రోజుల్లో రూ. 2035 తిరిగిచ్చారు. ఇలా పెట్టుబడి పెరిగిన కొద్దీ లాభాలు పెంచుకుంటూ పోయారు. ఒక దశలో రూ.లక్షా మూడు వేలు కడితే180 రోజులకు రూ.8, 52, 840 ఇస్తామని చెప్పడంతో చాలామంది డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇందులో ఎవరికీ డబ్బులివ్వలేదు.
వాట్సాప్‌తోనే నడిపించిన్రు
90 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసిన మోసగాళ్లు ఒక్కో గ్రూపులో 256 మంది చొప్పున 25 వేల మందిని చేర్చుకున్నట్టు తెలుస్తోంది. తమకు డబ్బులు వచ్చాయంటే.. తమకు వచ్చాయంటూ కంపెనీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ గ్రూపుల్లో పెట్టుబడిదారుల్లా స్క్రీన్షాట్స్పెడితే, అవి చూసిన మిగతా వారు ఆవేశ పడి డబ్బులు కుమ్మరించారు. వీటన్నింటికి ఇద్దరు, ముగ్గురు అడ్మిన్లు ఉండేవారని సమాచారం. 99533 21221 నంబర్ నుంచి మహిళ మాట్లాడేదేని, రెండు, మూడు రోజులుగా ఆ నంబర్ పని చేయడం లేదని, వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని బాధితులు చెబుతున్నారు. ఆ నంబర్ వాట్సాప్ డీపీలో కైలియా సింగ్అని చూపెడుతోందని, ఈ విషయమై సైబర్‌క్రైం పోలీసులకు కంప్లయింట్చేయనున్నట్టు బాధితులు సయ్యద్ అక్బర్, మహిమూద్ చెప్పారు.