
- కిందటి ఆర్థిక సంవత్సరంలో 57 టన్నుల సమీకరణ
- మొత్తం గోల్డ్ నిల్వలు 879.59 టన్నులు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2024–-25 ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో బంగారం నిల్వలను దాదాపు 25 టన్నులు పెంచుకుంది. ఈ సమయంలో గోల్డ్ రేట్లు 30 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద 879.59 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. కిందటేడాది సెప్టెంబర్ చివరినాటికి ఈ నెంబర్ 854.73 టన్నులుగా ఉంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మొత్తం 57 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.
స్థానికంగా 511.99 టన్నుల బంగారాన్ని నిల్వ చేస్తున్నామని, 348.62 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్) వద్ద సేఫ్ కస్టడీలో, 18.98 టన్నులు బంగారం డిపాజిట్ల రూపంలో ఉన్నాయని ఆర్‌బీఐ తన తాజా రిపోర్ట్‌లో పేర్కొంది.
కిందటి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆర్‌బీఐ ఎక్కువ బంగారాన్ని స్థానిక వాల్ట్‌లకు తరలించింది. స్థానికంగా నిల్వ చేసిన బంగారం మార్చి 31, 2024 నాటికి 408 టన్నులుగా ఉండగా, సెప్టెంబర్ 30 నాటికి 510.46 టన్నులకు పెరిగింది. గ్లోబల్‌గా రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు పెరుగుతుండడంతో ఆర్‌బీఐ తన గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటోంది.
మొత్తం ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్‌లలో బంగారం వాటా ఈ ఏడాది మార్చి చివరి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ఆరు నెలల క్రితం ఇది 9.32 శాతంగా ఉంది. మొత్తం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్‌లు ఈ ఏడాది మార్చి చివరినాటికి 668.33 బిలియన్ డాలర్లకు తగ్గాయి. కిందటేడాది సెప్టెంబర్ చివరిలో ఇవి 705.78 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నిల్వలతో 10.5 నెలల దిగుమతులను కవర్ చేయొచ్చు.