అందాల పోటీలపై కాదు.. అన్నదాతలపై శ్రద్ధ పెట్టండి : ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

 అందాల పోటీలపై కాదు.. అన్నదాతలపై శ్రద్ధ పెట్టండి :  ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు
  • రైతు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే...
  •  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

సిద్దిపేట, వెలుగు : ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ, అన్నదాతలపై లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. అకాల వర్షం కారణంగా సిద్దిపేట మార్కెట్‌‌‌‌లో తడిసిన వడ్లను, నంగునూరులో దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌ చెప్పిన వరంగల్‌‌‌‌ రైతు డిక్లరేషన్‌‌‌‌ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించే వారే కరువయ్యారన్నారు. 

వడ్ల కొనుగోళ్లు సరిగా జరగకపోవడంతో రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారన్నారు. అందాల పోటీల కోసం పోటీ పడి రివ్యూలు చేస్తున్న నాయకులకు కొనుగోలు కేంద్రాల్లోనే చనిపోతున్న రైతుల గుండెకోత వినిపించడం లేదా అని ప్రశ్నించారు. సిద్దిపేట మార్కెట్‌‌‌‌లో 3,500 ధాన్యం బస్తాలు తరలించడానికి సిద్ధంగా ఉన్నా, లారీలు లేకపోవడంతో వర్షానికి నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు అమ్మిన తర్వాత పది రోజులు గడుస్తున్నా రైతులకు డబ్బులు అందడం లేదన్నారు.

 ఈ సీజన్‌‌‌‌లో 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లను టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్న కాంగ్రెస్‌‌‌‌... ఇప్పటివరకు కేవలం 24.43 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాహకుల అలసత్వం కారణంగా రైతులు అరిగోస పడుతున్నారన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు. గత నెలలో వరుసగా ఐదు సార్లు వానలు పడడంతో మునుపెన్నడూ చూడని విధంగా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.