
- హాలివుడ్ ఇండస్ట్రీని బతికించేందుకే నిర్ణయమని వెల్లడి
- విధిస్తున్నట్లు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్
- హాలీవుడ్‌ను బతికించేందుకే నిర్ణయమని వెల్లడి
న్యూఢిల్లీ: విదేశీ సినిమాలపై 100 శాతం ట్యాక్స్ విధిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. హాలీవుడ్ ఇండస్ట్రీ అంతరించిపోయే పరిస్థితులున్నాయని, అమెరికన్ సినిమా పరిశ్రమను పునరుద్ధరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఫిల్మ్ మేకర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు ఇతర దేశాల్లోని స్టూడియోలు అనేకరకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్నారు. దాంతో అమెరికన్ హాలీవుడ్ ఇండస్ట్రీ వేగంగా అంతరించే దశకు చేరుకుందని, ఆ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు.
ఇదంతా విదేశాల సమన్వయ కుట్ర అని ఆరోపించారు. ఈ పరిస్థితి ఒకానొకస్థాయిలో జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుందన్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకే విదేశాల్లో తీసి అమెరికాలో ప్రదర్శించేందుకు వచ్చే అన్ని సినిమాలపై 100 శాతం ట్యాక్స్ విధిస్తున్నామని చెప్పారు. వెంటనే ఈ టారిఫ్‌ను అమలు చేయాలని సంబంధిత డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలో తీసే సినిమాలు రావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
కాగా, ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక చైనాతో టారిఫ్ యుద్ధాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపైనా భారీగా పన్నులు విధించారు. ఈ నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేయడంతో టారిఫ్‌ల అమలును వచ్చే జులైదాకా ట్రంప్ నిలిపివేశారు.