టీవీ బడి..వారం, పది రోజుల్లో షురూ కానున్న పాఠాలు

టీవీ బడి..వారం, పది రోజుల్లో షురూ కానున్న పాఠాలు
  • టీవీల్లేని వారికి బడుల్లో వినే వెసులుబాటు
  • కసరత్తు పూర్తిచేసిన ఎడ్యుకేషన్  డిపార్ట్​మెంట్
  • ప్రైమరీ స్టూడెంట్స్​కు వర్క్​షీట్లతో  టీచింగ్​
  • హైస్కూల్స్​వాళ్లకు టీవీల ద్వారా లెసన్స్​

హైదరాబాద్, వెలుగుబడిగంట త్వరలోనే మోగనుంది. కానీ బడిలో కాదు.. ఆన్​లైన్​ ద్వారా టీవీలో. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ఇప్పట్లో స్కూళ్లు తెరిచే అవకాశం లేకపోవడంతో అకడమిక్​ ఇయర్​ నష్టపోకుండా స్కూల్​ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ఆల్టర్నేటివ్ ప్లాన్​ రెడీ చేసింది. పిల్లలు ఇంట్లో ఉండే క్లాసులు వినేలా కార్యాచరణ రూపొందించింది.కరోనా ఎఫెక్ట్​తో విద్యావ్యవస్థ తీరు పూర్తిగా మారిపోయింది. దాదాపు నాలుగు నెలలుగా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు మూతపడ్డాయి. ఈ ఏడాది జీరో ఇయర్ చేస్తారా అనే సందేహాలూ వచ్చాయి. ఈ క్రమంలోనే  ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఆన్​లైన్ క్లాసులు మొదలుపెట్టాయి.దీంతో సర్కారుపై స్కూడెంట్స్​ పరిస్థితి ఎలా అనే విమర్శలొచ్చాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టెన్త్  క్లాసు స్కూడెంట్స్​కు ఆన్​లైన్​ క్లాసుల్ని టీచర్లు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లోని స్కూడెంట్స్​అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వం విద్యాశాఖతో ప్రణాళిక  రెడీ చేయించింది. వారం రోజుల్లోనే దీన్ని అమల్లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకోర్టులోనూ చెప్పే అవకాశముంది.

రాష్ట్రంలో 40,597 స్కూళ్లుండగా, వాటిలో 58 లక్షలకు పైగా స్టూడెంట్స్​ చదువుతున్నారు. దీంట్లో సర్కారీ విద్యాసంస్థలు (గురుకులాలతో కలిపి) 29,370 ఉంటే, వాటిలో 29.9 లక్షల మంది,11,227  ప్రైవేట్, ఎయిడెడ్​ స్కూళ్లలో 32 లక్షల మందికిపైగా స్టూడెంట్స్​చదువుతున్నారు. పరిస్థితులు బాగుంటే జూన్ 12 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్​తో ఇప్పటికీ స్కూళ్లు తెరుచుకోలేదు. ఎప్పుడు తెరుస్తారనేది కూడా స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆగస్టు15 తర్వాత నిర్ణయిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికే కార్పొరేట్, ప్రైవేట్​ స్కూళ్లు ఆన్​లైన్​ క్లాసుల పేరుతో ఫీజుల దోపిడీ మొదలుపెట్టాయి. పేరెంట్స్​ఒత్తిడి మేరకే క్లాసులు మొదలుపెట్టినట్టు మేనేజ్​మెంట్లు చెప్పుకొస్తున్నాయి. దీంతో ఈ ఆన్​లైన్​ క్లాసుల విషయంలో ప్రభుత్వంగానీ, విద్యాశాఖ అధికారులు గానీ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అయితే సర్కారు స్కూళ్లలో చదువుతున్న 30 లక్షల మంది పరిస్థితి ఎలా అని పేరెంట్స్ ​నుంచి సర్కారుపై ఒత్తిడి మొదలైంది. ప్రారంభిస్తే అందరికీ ఒకేసారి ప్రారంభించాలని, లేదంటే అసమానతలు పెరుగుతాయని, సర్కారు విద్యాసంస్థల్లో చదివే స్టూడెంట్స్​ నష్టపోతారని విద్యావేత్తలతోపాటు స్టూడెంట్స్, పేరెంట్స్​యూనియన్లు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. దీంతో సర్కారు ప్రత్యామ్నాయంగా అకడమిక్ క్యాలెండర్ రెడీ చేసింది. ఈనెలలోనే ప్రారంభించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రభుత్వ ఆమోదానికి విద్యాశాఖ పెట్టింది.

టీవీల ద్వారా లెసన్స్

ప్రస్తుతం రాష్ట్రంలోని మెజార్టీ ఫ్యామిలీల్లో టీవీలున్నాయి. దీంతో వీటి ద్వారానే లెసన్స్​ టెలికాస్ట్​ చేయాలని  సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీంట్లో భాగంగా సర్కారీ చానల్స్​ డీడీ యాదగిరి, టీశాట్​లోని రెండు చానల్స్​ ద్వారా హైస్కూల్ స్టూడెంట్స్​కు క్లాసులు చెప్పించనున్నారు. వీటితోపాటు అవకాశమున్న చోట ప్రైవేట్​ కేబుల్స్​ద్వారా పాఠాలు చెప్పించాలని యోచిస్తున్నారు. అయితే టీవీలు లేని పిల్లలను దగ్గరలోని ఫ్రెండ్స్​ఇండ్లలో గానీ, అక్కడా అవకాశం లేకుంటే స్కూల్స్​లో గానీ పాఠాలు వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లంతా బడులకు రావాల్సి ఉంటుంది.

ప్రతి క్లాస్కు రెండు గంటలు

ప్రైమరీ స్థాయిలో 3, 4, 5 క్లాసుల పిల్లలకు వర్క్​షీట్ల ద్వారా సబ్జెక్టులపై అవగాహన పెంచనున్నారు. ఆరో తరగతి నుంచి టెన్త్ వరకూ టీవీల ద్వారా క్లాసులు చెబుతారు. ప్రతిరోజు ఒక్కో తరగతికి రెండు గంటల చొప్పున మూడు క్లాసులు పెట్టాలని యోచిస్తున్నారు. ఒక్కో సబ్జెక్టు క్లాసు అరగంటపాటు ఉండాలని, పది నిమిషాలు బ్రేక్ టైమ్ ఇవ్వాలని భావిస్తున్నారు. అదేపనిగా పిల్లలు టీవీ చూస్తే ఇతర సమస్యలు వచ్చే అవకాశముందని ఈ విధానం అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. వర్క్​షీట్లను ఆన్​లైన్ ద్వారా ఎంఈవోలకు, హెడ్‌మాస్టర్లకు విద్యాశాఖ పంపించనుంది. వాటిని స్టూడెంట్స్​కు  ఇవ్వనున్నారు. పూర్తిస్థాయి షెడ్యూల్​ను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది.

ఆర్టీసీ నష్టాల జర్నీ