ఇంటర్‌ ఫస్టియర్ స్టూడెంట్లకు  క్లాసులెప్పుడు?

ఇంటర్‌ ఫస్టియర్ స్టూడెంట్లకు  క్లాసులెప్పుడు?

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసర్ల అనాలోచిత నిర్ణయాలు సర్కారు కాలేజీల్లో చేరిన స్టూడెంట్లకు ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. అడ్మిషన్లు తీసుకుని 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ  ఫస్టియర్‌ స్టూడెంట్లకు ఆన్‌లైన్‌ పాఠాలు స్టార్ట్ చేయలేదు. మరోపక్క కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో పర్మిషన్ లేకున్నా యథేచ్చగా క్లాసులు నడుస్తున్నాయి. ఆగస్టు ఫస్ట్ నుంచి ఒకటి, రెండో తరగతి స్టూడెంట్లకు టీవీ పాఠాలు స్టార్ట్ చేస్తామని ప్రకటించిన సర్కారు దాన్ని అమలు చేసేలా కనిపించడం లేదు. దీంతో సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో చేరిన స్టూడెంట్లు, వారి పేరేంట్లలో ఆందోళన మొదలైంది.

 ముందు జూన్ 1 నుంచే అన్నరు..

రాష్ట్రంలో ఈ నెల ఫస్ట్ నుంచి మూడో తరగతి ఆపై క్లాసులకు ఆన్​లైన్, డిజిటల్ పాఠాలకు సర్కారు అనుమతించింది. అంతకుముందే మే 25 నుంచి ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ప్రకటించారు. జూన్1 నుంచి ఫస్టియర్​ స్టూడెంట్లకు ఆన్​లైన్ పాఠాలు స్టార్ట్ చేస్తామన్నారు. దీనిపై సర్కారు పెద్దల నుంచి బోర్డు సెక్రటరీకి చీవాట్లు పడటంతో ఆన్​లైన్ క్లాసులపై వెనక్కి తగ్గారు. జులై1 నుంచి ఇంటర్ సెకండియర్​కు టీవీ పాఠాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రైవేటు కాలేజీలకు గుర్తింపు ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో ఈనెలాఖరు వరకూ ఫస్టియర్ అడ్మిషన్లకు గడువు పెంచారు. ఇప్పటివరకు దాదాపు 92 వేల మంది 405 సర్కారు కాలేజీల్లో ఫస్టియర్​లో చేరారు. వారికి ఎప్పుడు క్లాసులు స్టార్ట్ చేస్తారో సర్కారు పెద్దలు గానీ, ఇంటర్ బోర్డు అధికారులు గానీ స్పష్టత ఇవ్వడం లేదు. మొన్నటివరకూ జులై15 నుంచి ప్రారంభిస్తారనే ప్రచారం చేసినా ఇప్పటికీ క్లాసుల ప్రారంభంపై ప్రతిపాదనలు సర్కారుకు పంపలేదని తెలుస్తోంది. 

ఫస్ట్, సెకండ్ క్లాసులకూ లేనట్టే..

ఇక ఆగస్టు 1 నుంచి సర్కారు స్కూళ్లలో చదివే ఫస్ట్, సెకండ్ క్లాసుల పిల్లలకు టీవీ పాఠాలు స్టార్ట్ చేస్తామని మంత్రి సబితారెడ్డి గతంలో ప్రకటించారు. పిల్లల్ని బడుల్లోకి రప్పించేందుకు , వారంతా పాఠాలు వినేలా ముందుగా నెల రోజులు రెడీనెస్ ప్రోగ్రాం నిర్వహిస్తామని చెప్తున్నారు. కనీసం ఆ క్లాసులైనా ఎప్పట్నుంచి ప్రారంభిస్తారనే విషయాన్ని మాత్రం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్పట్లేదు.  ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ఈనెల ఫస్ట్ నుంచే క్లాసులు ప్రారంభించేందుకు సర్కారు పర్మిషన్ ఇచ్చింది. దీంతో సర్కారు స్కూళ్లలో చేరిన స్టూడెంట్ల పేరెంట్లలో అసలు స్టార్ట్ చేస్తారా లేదా అనే అయోమయం మొదలైంది. 

ప్రైవేటులో మాత్రం క్లాసులు...

రాష్ట్రంలో 1,400 దాకా ప్రైవేట్‌ ఇంటర్ కాలేజీలున్నా గురువారం నాటికి 296 కాలేజీలకే గుర్తింపు ఇచ్చినట్టు ఇంటర్ బోర్డు వెబ్ సైట్​లో పెట్టారు. కానీ, అన్ని కాలేజీల్లో ఆన్​లైన్​క్లాసులు నడుస్తున్నాయి. ఫస్టియర్​ క్లాసులకు పర్మిషన్ లేకున్నాకార్పొరేట్ కాలేజీ లు  క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ ఇప్పటికీ రిలీజ్ చేయలేదు.