పెనుబల్లి, వెలుగు : ఓ యాడ్‌ను చూసి ట్యాబ్లెట్లు బుక్ చేసిన వ్యక్తిని కొందరు వ్యక్తులు బెదిరించి డబ్బులు వసూలు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి గ్రామంలో ఎలక్ట్రికల్ షాప్ నడుపుతున్నాడు. గతేడాది నవంబర్‌లో ఫేస్‌బుక్ చూస్తుండగా... పీఎల్‌సీ ట్యాబ్లెట్లు వాడితే చెవుడు తగ్గిపోతుందని యాడ్ కనిపించడంతో క్యాష్ ఆన్ డెలివరీతో ట్యాబ్లెట్లు ఆర్డర్ చేశాడు. ఎన్ని రోజులైనా ట్యాబ్లెట్లు డెలివరీ కాకపోవడంతో ఆ విషయాన్ని వదిలేశాడు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొందరు వ్యక్తులు అతడికి ఫోన్ చేసి.. మీరు ఇచ్చిన అడ్రస్‌లో సమస్య ఉందని, ఈ విషయంపై కేసు పెడుతామంటూ బెదిరించారు. డబ్బులు ఇస్తే కేసు లేకుండా చూస్తామని చెప్పడంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఫోన్ పే ద్వారా విడతల వారీగా రూ. 76 వేలు పంపించాడు. చివరకు అదంతా ఫేక్ అని తెలియడంతో సోమవారం వీఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
