ఎములాడ రాజన్న ఆర్జిత సేవల బుకింగ్ ఇక ఆన్​లైన్​లో..

ఎములాడ రాజన్న ఆర్జిత సేవల బుకింగ్ ఇక ఆన్​లైన్​లో..

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అన్​లైన్​ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం ఆలయంలో ఈవో కృష్ణ ప్రసాద్​ వెబ్​సైట్​ను లాంఛనంగా ప్రారంభించారు. ఇక నుంచి భక్తులు vemulawadatemple.telangana. gov.in  ద్వారా అన్ని రకాల ఆర్జిత సేవలను ఆన్​లైన్​లో బుక్​చేసుకోవచ్చన్నారు.

అలాగే వెబ్​ సైట్​ లో ఆలయంలో ప్రతి రోజు జరిగే పూజల వివరాలు, సమయాలు చూసుకోవచ్చన్నారు. కోడె కట్టడం, రుద్రాభిషేకం , అన్నపూజ , అభిషేకం (నాగిరెడ్డి మంటపం)-, ఆకుల పూజ,  కుంకుమ పూజ , శివ కళ్యాణం , చండీ సహీత రుద్రహోమం, మహా లింగార్చన, పెద్దసేవ, పల్లకీ సేవ, వాహన పూజ,  సత్యనారాయణ వ్రతం, కేశ ఖండనం, గండాదీపం తదితర సేవలను ఇక నుంచి ఆన్​లైన్​లో బుక్​ చేసుకోవచ్చన్నారు.

అనుబంధ ఆలయాలైన భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ ఆలయం, నగరేశ్వర ఆలయాల సమాచారాన్ని కూడా పొందుపరిచామన్నారు. ఈ–డొనేషన్​ కాలమ్​లో  హుండీకి భక్తులు, అన్నదానానికి దాతలు కానుకలు పంపవచ్చన్నారు. రాజన్న ఆలయానికి రాష్ర్టంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా  ఏపీ, మహారాష్ర్ట, చత్తీస్​గఢ్​ ల నుంచి భక్తులు వస్తుంటారు. దీంతో వీరికి టెంపుల్​లో జరిగే పూజలు, ఇతర వివరాలు తెలియకపోయేది. వెబ్​సైట్​అందుబాటులోకి రావడంతో ఇక నుంచి తిప్పలు తప్పనున్నాయి.