డెలివరి మళ్లీ షురూ.. త్వరలో ఆన్ లైన్ బుకింగ్స్

డెలివరి మళ్లీ షురూ.. త్వరలో ఆన్ లైన్ బుకింగ్స్

న్యూఢిల్లీలాక్‌‌డౌన్‌‌కు ముందు మొబైల్‌‌ఫోన్లు, ఫ్రిజ్‌‌లు, ల్యాప్‌‌టాప్‌‌ల వంటి వస్తువులను అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ వంటి సైట్లలో బుక్‌‌ చేసుకున్న వారికి ఇప్పటికీ అవి అందలేదు. మందులు, ఆహారం, వైద్యపరికరాల వంటి అత్యవసర వస్తువులు మినహా ఇతర డెలివరీలను పక్కనబెట్టాలని కేంద్రం ఆదేశించడమే ఇందుకు కారణం. అయితే తాజాగా లాక్‌‌డౌన్‌‌ నుంచి ఈ–కామర్స్‌‌కు మోడీ ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ సైట్లు యథావిధిగా వ్యాపారం చేసుకోవచ్చని సూచించింది. దీంతో ఈ కంపెనీ గతంలో బుక్‌‌ చేసుకున్న వస్తువులను డెలివరీ చేయడమేగాక కొత్త ఆర్డర్లనూ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్లిప్‌‌కార్ట్‌‌ ఈ నెల 20 నుంచి అన్ని రకాల ఆర్డర్లు తీసుకుంటుందని కంపెనీ వర్గాలు తెలపగా, అమెజాన్‌‌ మాత్రం కేంద్ర హోంశాఖ నుంచి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తోంది. గతంలో కేంద్రం ఇచ్చిన గైడ్‌‌లైన్స్‌‌లో ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలు అత్యవసరాలను మాత్రమే డెలివరీ చేయాలని పేర్కొన్నారు. తాజాగా బుధవారం వచ్చిన గైడ్‌‌లైన్స్‌‌ ‘అత్యవసరం, అత్యవసరం కానివి’.. అంటూ ప్రత్యేకంగా ఏమీ పేర్కొనలేదు. ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలకు లాక్‌‌డౌన్‌‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు మాత్రమే ఉంది. దీంతో  కంపెనీల్లో కొంత గందరగోళం నెలకొంది.

వ్యాపారం మొదలుపెట్టొచ్చు…

ఈ విషయమై కేంద్ర హోంశాఖ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు మాట్లాడుతూ తాజా గైడ్‌‌లైన్స్‌‌ స్పష్టంగా ఉన్నాయని, ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలు అన్ని వస్తువులను డెలివరీ చేయవచ్చని అన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలు ఉంటే తదనంతరం పరిష్కరిస్తామని అన్నారు. అన్ని రకాల వస్తువులకు ఆర్డర్లు తీసుకోవచ్చని నీతి ఆయోగ్ ఈ-–కామర్స్‌‌ కంపెనీల సీఈఓలకు చెప్పినట్టు తెలిసింది. ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలకు అనుమతి ఇస్తే ప్రజలకు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఉంటారనేది ప్రభుత్వ అభిప్రాయమని ఒక సీఈఓ అన్నారు. అయితే కరోనా కంటైన్‌‌మెంట్ జోన్లకు అత్యవసర వస్తువులు మినహా వేరే ప్రొడక్టులను డెలివరీ చేయకూడదని ప్రభుత్వం షరతు పెట్టింది.

నాన్‌‌ఎసెన్షియల్‌‌ ప్రొడక్టులకే ఎక్కువ డిమాండ్‌‌

ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలకు ‘అత్యవసరం కాని వస్తువుల’ కోసమే ఎక్కువ ఆర్డర్లు వస్తాయి. స్మార్ట్‌‌ఫోన్లు, వైట్‌‌గూడ్స్‌‌, ఫ్యాషన్‌‌ కేటగిరీల నుంచే 90 శాతం ఆర్డర్లు వస్తాయి. వీటితో లాభాలు కూడా ఎక్కువ. ఈ నెల 20 నుంచి తమ సైట్లు, యాప్‌‌ల నుంచి ఆర్డర్లు ఇవ్వొచ్చని పేటీఎం మాల్‌‌, స్నాప్‌‌డీల్‌‌ ఇది వరకే ప్రకటించాయి. అయితే ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీల ద్వారా వస్తువులు అమ్మే సెల్లర్లు మాత్రం స్థానిక పోలీసులు తమను అడ్డుకుంటారేమోనని భయపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. పెద్ద కంపెనీలు స్థానిక ఇబ్బందులను అధిగమిస్తాయని, చిన్న వ్యాపారులకు సమస్యలు ఉంటాయని ఆలిండియా ఆన్‌‌లైన్‌‌ వెండర్స్ అసోసియేషన్‌‌ ప్రతినిధి ఒకరు అన్నారు.

ఈ నెల 20 నుంచి మొదలయ్యే సేవలు, వ్యాపారాలు, కార్యకలాపాలు

  •    వస్తువులను రవాణా చేసే వాహనాలు. హైవేల పక్కన ఉండే ఢాబాలు. ట్రక్‌‌ రిపేర్‌‌ షాప్స్‌‌
  •    ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలు, వీటి వాహనాలు.
  •    ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలు. సగం సిబ్బందితోనే నడపాలి
  •    ఎలక్ట్రీషియన్లు, ఐటీ, రిపేర్లు, ప్లంబర్లు, మోటార్ మెకానిక్స్‌‌, కార్పెంటర్లు.
  •    సెజ్‌‌లో మాన్యుఫ్యాక్చరింగ్‌‌, ఎక్స్‌‌పోర్ట్‌‌ యూనిట్లు, ఇండస్ట్రియల్‌‌ ఎస్టేట్లు
  •    ఐటీ హార్డ్‌‌వేర్‌‌ మాన్యుఫ్యాక్చరింగ్‌‌, అత్యవసర వస్తువుల తయారీ, ప్యాకింగ్‌‌
  •    బొగ్గు, ఖనిజాలు, ఆయిల్‌‌ ప్రొడక్షన్‌‌
  •    ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌, రోడ్‌‌ కన్‌‌స్ట్రక్షన్‌‌, ఇరిగేషన్‌‌, బిల్డింగ్స్‌‌ నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్‌‌ ప్రాజెక్టులు
  •    వ్యవసాయ పరికరాల తయారీ, ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల అమ్మకం
  •    టీ, కాఫీ, రబ్బర్‌‌ ప్లాంటేషన్లు కూడా మొదలవుతాయి. సగం మంది కూలీలతోనే నడిపిస్తారు.