రాజన్న దర్శనానికి ఆన్ లైన్ బుకింగ్

రాజన్న దర్శనానికి ఆన్ లైన్ బుకింగ్

వేములవాడ, వెలుగు: ఈ నెల 21 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. శ్రావణమాసంలో ఉపవాసం ఉండి శివుడిని దర్శిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రావణమాసంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వేలల్లో భక్తులు తరలివస్తుంటారు. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి ఎక్కువగా భక్తులు వస్తుంటారు. గత సంవత్సరం శ్రావణమాసంలో ప్రతిరోజు సుమారు 30 వేల మంది భక్తులు, సోమవారం 50 వేలకు పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఆషాడ మాసంలో ప్రతి రోజు 2 వేల వరకు భక్తులు వస్తున్నారు. శ్రావణమాసంలో రద్దీమరింత పెరిగే అవకాశం ఉండడం, ప్రస్తుతం కరోనా కాలం కావడంతో అధికారులు ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఆన్లైన్ బుకింగ్ ఉంటేనే దర్శనం అనుమతి ఇచ్చేలా ఇప్పటికే దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గంటకు 300 మంది చొప్పున ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5.30 వరకు దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం ఐటీ విభాగానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఆలయవర్గాలు తెలిపాయి.

కలవరపెడుతున్న కరోనా
కరోనా రోజురోజుకు విస్తరిస్తుండడంతో ఆలయ ఉద్యోగుల్లో కంగారు మొదలైంది. ఇప్పటికే ఆలయంలోని ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సుమారు 30 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. శ్రావణ మాసంలో వేములవాడ రాజన్న ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. కరోనానేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భక్తులకు ఎలా దర్శనం కల్పించాలనే విషయమై ఆలయ అధికారులు, ఉద్యోగులతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు.

ఐటీ విభాగానికి ప్రతిపాదనలు పంపించాం
శ్రావణమాసంలో వేలల్లో భక్తులు వేములవాడకి వచ్చే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ లో ముందుగా బుకింగ్ చేసుకున్నవారు మాత్రమే స్వామిని దర్శించుకునేలా ప్రభుత్వం ఐటీ విభాగానికి ప్రతిపాదనలు పంపించాం. వారి నుంచి రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అనుమతి రాకుంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. భక్తులను పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఆలయంలోకి అనుమతిస్తాం. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వం. అలాగే కరోనా విషయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.
‑ రాజేశ్, ఈఈ, రాజన్న ఆలయం

For More News..

నాన్ టీచింగ్ స్టాఫ్ ను తీసేస్తున్న ప్రైవేట్ స్కూళ్లు

అడ్డుకోబోమని ఇప్పుడు చెప్పండి.. ఏడాదిలో కొత్త బిల్డింగ్

లక్షలు పెడతామన్నా బెడ్లు లేవ్.. నరకం చూస్తున్న కరోనా పేషెంట్లు