1976 కాలేజీలకు గాను 141 కాలేజీలకే అక్రిడిటేషన్

1976 కాలేజీలకు గాను 141 కాలేజీలకే అక్రిడిటేషన్
  • న్యాక్ గుర్తింపు.. 11 శాతం కాలేజీలకే
  • రాష్ట్రంలో 1976 కాలేజీలకు గాను 141 కాలేజీలకే అక్రిడిటేషన్
  • మూడు రాష్ట్ర యూనివర్సిటీలకు లేదు 
  • సర్కార్ ప్రోత్సాహం లేదంటున్న విద్యావేత్తలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేషనల్ అసెస్‌‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) గుర్తింపు పొందిన కాలేజీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇప్పటి వరకు కేవలం 11 శాతం కాలేజీలకే ఈ గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో డిగ్రీ ఆపై స్థాయి కాలేజీలు 1,976 ఉండగా, వీటిలో కేవలం 141 కాలేజీలకే న్యాక్ గుర్తింపు ఉంది. గతంలో 222 కాలేజీలకు గుర్తింపు ఉండగా, 81 కాలేజీలు రెన్యూవల్ చేసుకోకపోవడంతో ఆ సంఖ్య 141కి తగ్గింది. న్యాక్ గుర్తింపు దక్కిన కాలేజీల వివరాలతో కూడిన బుక్​ను రెండ్రోజుల కింద బెంగళూరులో గవర్నర్ తమిళిసై రిలీజ్ చేశారు.

గుర్తింపు ఉంటే యూజీసీ నిధులు.. 
న్యాక్ గుర్తింపు దక్కిన కాలేజీల్లో 120 కోఎడ్యుకేషన్, 21 విమెన్ కాలేజీలు ఉన్నాయి. అయితే స్టేట్ వర్సిటీలైన జవహర్​లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్, శాతవాహన, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఇంకా న్యాక్ అక్రిడిటేషన్ రాలేదు. రాష్ట్ర సర్కార్, ఉన్నత విద్యా శాఖ నుంచి ప్రోత్సాహం లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విద్యావేత్తలు అంటున్నారు. కాలేజీల్లో సౌలతులను పరిశీలించి న్యాక్ స్కోర్, గ్రేడింగ్ ఇస్తారు. కాలేజీల్లోని సౌలతులకు అనుగుణంగా A++, A+, A,  B++, B+, B, C, D గ్రేడ్‌‌లు కేటాయిస్తారు. డీ గ్రేడ్ ఇస్తే గుర్తింపు ఇవ్వనట్టే. న్యాక్ గుర్తింపు ఉన్న కాలేజీలకు యూజీసీ నుంచి నిధులు కూడా వస్తాయి. అయినా అప్లై చేసుకునేందుకు కాలేజీలు ముందుకు రావడం లేదు. న్యాక్ ద్వారా జరిగే లాభాల గురించి తెలియకపోవడం, కాలేజీల్లో సౌలతులు లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత తదితర ఇందుకు కారణమని తెలుస్తోంది.

87 ప్రైవేట్ కాలేజీలే.. 
ప్రస్తుతం న్యాక్ గుర్తింపు పొందిన వాటిలో గవర్నమెంట్ కాలేజీలు 35 ఉండగా, ప్రైవేట్ కాలేజీలు 87, గ్రాంట్ ఇన్​ ఎయిడ్ తో నడిచే కాలేజీలు 19 ఉన్నాయి. అత్యధికంగా జేఎన్టీయూహెచ్ పరిధిలో 423 కాలేజీలుంటే 63 కాలేజీలకు గుర్తింపు ఉంది. ఓయూ పరిధిలో 407 కాలేజీలకు 34, కాకతీయ వర్సిటీ పరిధిలో 293 కాలేజీలకు 18 కాలేజీలకు న్యాక్ గుర్తింపు ఉంది. గుర్తింపు పొందిన వాటిలో ఇంజనీరింగ్/ మేనేజ్మెంట్ కోర్సుల కాలేజీలు 67, మెడికల్/డెంటల్/ ఫార్మసీ కాలేజీలు 11 ఉండగా.. రూరల్ ఏరియాలో 63, అర్బన్​ ఏరియాలో 72, సెమీ అర్బన్ ఏరియాలో 6 కాలేజీలు ఉన్నాయి.