హుజూరాబాద్‌‌లో 12 మంది దళితులకే మూడెకరాల భూమి

హుజూరాబాద్‌‌లో 12 మంది దళితులకే మూడెకరాల భూమి
  • ఏడేండ్ల కింద ఘనంగా తెచ్చిన పథకం ఇప్పుడు మూలకుపడ్డది
  • రాష్ట్రంలో 3 లక్షల మందికి ఇస్తామని.. 6,931 మందికే ఇచ్చిన్రు
  • మూడు జిల్లాల్లో ఒక్కరికీ ఇయ్యలే.. భూమి దొర్కుతలేదని సాకులు

హైదరాబాద్‌‌, వెలుగు: హుజూరాబాద్​ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి నెల రెండు నెలల్లో దళిత బంధు కింద రూ. 10 లక్షలు ఇస్తామని చెప్తున్న రాష్ట్ర సర్కారు.. ఏడేండ్ల కింద ఘనంగా మొదలుపెట్టిన మూడెకరాల భూ పంపిణీ స్కీంను మాత్రం మూలకుపెట్టిందిa. ఈ స్కీం కింద నియోజకవర్గంలో ఇప్పటివరకు 12 మందికే భూమిని ఇచ్చింది. దీంట్లో ఇల్లందకుంట మండలంలో 8 మందికి, జమ్మికుంట మండలంలో ఇద్దరికి, హుజూరాబాద్‌‌ మండలంలో ఇద్దరికి ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో 21వేల దళిత కుటుంబాలు ఉన్నాయని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. అలాంటిది 12 మందికి మాత్రమే భూ పంపిణీ స్కీం అమలు చేశారు. 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నియోజకవర్గంలో భూ పంపిణీ పథకానికి 7 వేల మందికి పైనే అర్హులు ఉన్నారు. ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది. 
చెప్పుడేమో మస్తుగ
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఎస్సీలను అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు మూడెకరాల భూ పంపిణీ స్కీంను తెస్తున్నట్లు ఏడేండ్ల కింద రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఈ స్కీంను 2014 ఆగస్టు 15న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత దీని పేరును ‘భూ కొనుగోలు, పంపిణీ స్కీం’గా మార్చారు. ఫ్యామిలీలోని మహిళ పేరుతో మూడెకరాల భూమిని ఇవ్వాలి. ఈ ల్యాండ్‌‌ను ప్రభుత్వం.. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తుంది. ఇందుకు ఎకరాకు సగటున రూ. 2 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు సర్కారు ఖర్చు చేస్తుంది. ఇలా పంపిణీ చేసిన భూమిలో పంటసాగు చేసుకునేందుకు అవసరమైన సహకారాన్ని, సాగునీటి సదుపాయాన్ని కూడా ప్రభుత్వం అందివ్వాలి. 
ఇచ్చిందేమో 5 శాతంలోపే 
సీఎం కేసీఆర్‌‌ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలున్నాయి. ఇందులో 3.3 లక్షల దళిత కుటుంబాలకు అంగుళం భూమి కూడా లేదు. అర్హులైన మూడు లక్షల మందికి భూమి ఇస్తామని గతంలో ప్రభుత్వం  హామీ ఇచ్చింది. కానీ అందులో కనీసం 5శాతం మందికి కూడా ఇవ్వలేదు. మంగళవారం వరకు రాష్ట్రంలో మొత్తం 6,931మందికి మాత్రమే భూమిని పంచినట్లు లెక్కల్లో చూపించారు. అయితే ఇందులోనూ మరో వెయ్యి మందికి రిజిస్ట్రేషన్‌ చేయించకపోవడం, చేసినా డాక్యుమెంట్లు ఇవ్వకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. ఇంకా మూడు జిల్లాల్లో ఈ పథకం ప్రారంభించలేదు. భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో ఒక్కరికి కూడా పంచలేదు. 13 జిల్లాల్లో వందలోపు మందికే భూ పంపిణీ చేశారు. మొత్తంగా రాష్ట్రంలో 6,931 మందికి 16, 975 ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేశారు. ఇందులో హుజూరాబాద్​ నియోజకవర్గంలో 12 మందికి మాత్రమే ఇచ్చారు.  
భూమి దొర్కుతలేదట
భూ పంపిణీకి ల్యాండ్‌ దొరకడం లేదని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాల్లో ప్రభుత్వ భూములు పెద్దగా లేవని, ప్రైవేట్‌ వ్యక్తులు ముందుకు రావడంలేదని అంటోంది. బడ్జెట్‌లో నిధులు కూడా అరకొరగా కేటాయిస్తోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లు కేటాయిస్తే, 300 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఏటా ఇదే తంతు నడుస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 300 కోట్లు మాత్రమే కేటాయించారు.    
వారికి భూములు ఎట్ల దొరుకుతున్నయ్‌..?
బంగారు తెలంగాణలో దళిత రైతులు ఆత్మహత్య చేసుకున్నా సర్కారు భూములు ఇస్తలేదు. భూ పంపిణీ స్కీం అమలులో తీవ్రజాప్యం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్​లో రూ. 300 కోట్లు మాత్రమే కేటాయించింది. భూమి దొరకడం లేదని సాకులు చెబుతోంది. మరి ప్రాజెక్టులు, పరిశ్రమలకు లక్షలాది ఎకరాల భూమి ఎట్ల దొరుకుతోంది. - శంకర్‌, దళిత బహుజన ఫ్రంట్‌, జాతీయ కార్యదర్శి