
న్యూఢిల్లీ, వెలుగు: మిషన్ భగీరథ పథకం దాదాపు పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్తున్నా.. 33 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయని కేంద్రానికి రిపోర్టులు పంపినట్లు తెలుస్తోంది. ఈ విషయం సోమవారం ఢిల్లీలో జరిగిన జల్ జీవన్ మిషన్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. సమావేశంలో రాష్ట్రాల వారీగా కేంద్ర అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం పంపిన రిపోర్టును కూడా బయటపెట్టారు. భగీరథ పనులు కేవలం 33శాతం పూర్తయినట్లు ప్రజెంటేషన్‌లో వారు వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. భగీరథ ఖర్చులో సగం కేంద్రం భరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పదే పదే చేస్తున్న డిమాండ్లపై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమావేశంలో స్పందించారు. రాష్ట్ర సర్కార్ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్ ఘర్ జల్ పథకం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు కేవలం ‘ఇంటింటికీ నిధులు’ అనుకుంటున్నారని కేంద్ర మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగా ఇంటింటికి నీరందించడంతోపాటు, నీటి నిల్వకు చర్యలు, భూగర్భ జలాల పరిరక్షణ వంటివి ఉంటాయని చెప్పారు. కానీ, తెలంగాణ సర్కారు మాత్రం ఇవేవీ చేయకుండా కేవలం పైపులు వేసి, ప్రాజెక్టు అంచనాలో 50% నిధులు ఇవ్వాలనడం సరికాదని కేంద్ర మంత్రి అన్నట్లు తెలిసింది. మిషన్ భగీరథ పథకం ఇంటింటికి తాగునీరు మాత్రమే అందించనుందని, హర్ ఘర్ జల్ లోని మిగిలిన లక్ష్యాలను చేపట్టినప్పుడే నిధులు వస్తామని ఆయన తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాలతోపాటే నిబంధనల ప్రకారం తెలంగాణకు కూడా నిధులిస్తామని పేర్కొన్నారు.
సగమైనా ఇవ్వండంటున్న రాష్ట్ర సర్కార్
దాదాపు 90 శాతానికి పైగా మిషన్ భగరీథ పనులు పూర్తయ్యాయని, చాలా ప్రాంతాలకు నీళ్లిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. దీనికి సుమారు రూ. 40 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇందులో సగమైనా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇదే అంశంపై టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వర్రావు సైతం పార్లమెంట్లో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన హర్ ఘర్ జల్ పథకంలో భాగంగా మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ కోరుతోంది. 33శాతమే పనులు చేపట్టి, నిధులు ఇవ్వాలంటే ఎలా అని కేంద్ర మంత్రి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పైపులేసినంత మాత్రాన పైసలు ఇవ్వబోరని.. నిబంధనలకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. మిషన్ భగీరథకు సంబంధించి రాష్ట్ర అధికారులు కేంద్ర మంత్రిత్వ శాఖకు ఆన్లైన్లో పంపిన సమాచారాన్ని బేస్ చేసుకొని మంత్రి మాట్లాడినట్లు తెలుస్తోంది. భగీరథ విషయంలో రిపోర్టులో ఒకరకంగా చెబుతూ.. పైకి మరోలా చెబుతుండటాన్ని ఆయన తప్పుబట్టినట్లు సమాచారం.