
ముషీరాబాద్,వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో కుల జనగణన చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని కోరారు. మంగళవారం నల్లకుంటలోని పార్టీ రాష్ట్ర ఆఫీసులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.
దీనికి సూర్యప్రకాష్ హాజరై మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఉండడంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నతస్థానంలో రాణించగలుగుతున్నారన్నారు. దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీ జాతులకు చట్టసభల్లో రాజ్యాంగ పరమైన రాజకీయ రిజర్వేషన్ లేకపోవడంతోనే వెనకబాటుకు కారణమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయంగా అభివృద్ధి చెందిన జాతి మాత్రమే ఆర్థిక సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆధిపత్య కులాల రాజకీయ పార్టీల కనుసన్నల్లో మెదిలే రాజకీయ బానిసల పై బీసీలు ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ధిరాములు, సబ్బని లత,ఎంఏ గౌడ్, సునీల్ కుమార్, ఎం. ఆంజనేయులు, వడ్ల సాయికృష్ణ, సమ్మయ్య, నగేష్, అశోక్ గౌడ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.