కరోనా ఎఫెక్ట్: ఆస్కార్ అవార్డుల ఎంపికలో కొత్త విధానం

కరోనా ఎఫెక్ట్: ఆస్కార్ అవార్డుల ఎంపికలో కొత్త విధానం

లాస్ ఏంజెల్స్: కరోనా లాక్ డౌన్ అన్ని వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సినిమా ఇండస్ట్రీపై ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. హాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలు లేకుండా ప్రతి చిత్ర పరిశ్రమలోనూ షూటింగులు రద్దయ్యాయి. రిలీజ్ కు రెడీగా ఉన్న తమ సినిమాలను కొందరు నిర్మాతలు థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకోగా.. మరికొందరు ప్రొడ్యూసర్స్ తమ ఫిల్మ్స్ ను మంచి ధర పలికితే ఓటీటీ కంపెనీలకు అమ్మేస్తున్నారు. కొత్త సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో తప్ప థియేటర్లలో రిలీజే చేయలేని పరిస్థితి నెలకొంది. అన్ని సినీ పరిశ్రమలు మూతబడిన నేపథ్యంలో ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల కమిటీ ‘అకాడమీ ఆఫ్​ మోషన్ పిక్చర్ ఆర్ట్స్, సైన్సెస్’ కీలక డెసిషన్ తీసుకుంది. రానున్న 93వ ఆస్కార్ అవార్డుల (2021) అర్హతకు ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ అయిన సినిమాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కరోనా కారణంగా తాత్కాలిక మినహాయింపును ఇస్తున్నామని చెప్పింది. సినిమాలు చేసే మ్యాజిక్ ను చూడటానికి థియేటర్లను మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని, దీనికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. కరోనా వ్యాప్తి కారణంగా అకాడమీ అవార్డ్స్ రూల్స్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇలా ‘టెంపరరీ ఎగ్జెంప్షన్’ ఇస్తున్నామని చెప్పింది. ‘అనిశ్చితి నెలకొన్న ఈ పరిస్థితుల్లో మెంబర్లతోపాటు కొలీగ్స్ కు అకాడమీ మద్దతుగా ఉంటుందది. వారి పనితీరును, అవసరాన్ని, ప్రాముఖ్యతను మేం గుర్తించాం. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో ఆడియన్స్ గతంలో కంటే ఎక్కువగా సినిమాలను అభినందిస్తున్నారు’ అని అకాడమీ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్, సీఈవో డాన్ హడ్సన్ ఓ ప్రకటనలో చెప్పారు. వాస్తవానికి 93వ అకాడమీ అవార్డ్స్ వేడుకకు థియేట్రికల్ రిలీజ్ చేసిన సినిమాలకు అవార్డును ప్లాన్ చేశారు. ప్రస్తుత తరుణంలో కమర్షియల్ స్ట్రీమింగ్ లేదా వీడియో ఆన్ డిమాండ్ (వీవోడీ) సర్వీసు ద్వారా మాత్రమే కొత్త మూవీస్ రిలీజులు అందుబాటులో ఉండటంతో వాటిల్లో వచ్చిన సినిమాలనే బెస్ట్ పిక్చర్, జనరల్ ఎంట్రీతోపాటు స్పెషల్ కేటగిరీల్లో అర్హత ఇవ్వనున్నారు. అయితే స్ట్రీమింగ్ సైట్, వీవోడీలో 60 రోజుల పాటు స్ట్రీమ్ చేసిన మూవీస్ ను మాత్రమే అవార్డు అర్హతగా తీసుకోనున్నారు. అలాగే థియేటర్ల రీఓపెన్ తర్వాత అకాడమీ క్వాలిఫయింగ్ రిక్వైర్ మెంట్స్ ప్రకారం థియేటర్ రిలీజ్ మూవీస్ ను మాత్రమే అవార్డు ఎంపికలో అర్హతగా తీసుకోనున్నారు.