టీఆర్‌‌ఎస్‌‌ను ఓడిస్తేనే అభివృద్ధి : ఉత్తమ్‌‌

టీఆర్‌‌ఎస్‌‌ను ఓడిస్తేనే అభివృద్ధి : ఉత్తమ్‌‌

మేళ్లచెరువు, వెలుగు: హుజూర్‌‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌‌ను ఓడిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం చింతలపాలెం మండలం నక్కగూడెం, చింత్రియాల, కిష్టాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధికి నోచుకోక పూర్తిగా వెనుకబడి ఉండేవని….. దీంతో ఇక్కడి యువకులకు పెళ్లిళ్లు కూడా జరిగేవి కాదన్నారు. అలాంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మండలంలో పులిచింతల ప్రాజెక్టు, ఆర్ అండ్ ఆర్ సెంటర్లు, లిఫ్ట్‌‌ల ఏర్పాటు, కృష్ణానది నుంచి తాగునీటి వసతి కల్పించిందన్నారు. టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చాక ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఆనాడు తాను చేసిన పనులే తప్ప ఇక్కడ కొత్తగా ఏ పనీ జరగలేదన్నారు. టీఆర్ఎస్‌‌ను ఓడిస్తేనే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు.

కొంత కాలంగా రాజకీయాల్లోకి వస్తున్న వారు భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, లిక్కర్ వ్యాపారాలు చేస్తూ ప్రజలపై పెత్తనం చేయాలని చూస్తున్నారని…  అలాంటి వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని వాగ్దానం చేసిన టీఆర్ఎస్…. ఒక్క ఇంటినైనా నిర్మించిందా అని ప్రశ్నించారు. ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నామని…. ఒక్క రూపాయి ఆశించకుండా పని చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి, తన సతీమణి పద్మావతికి ఓటేసి అత్యధిక మొజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండారెడ్డి, ఇంద్రారెడ్డి, శేషు, కార్యకర్తలు పాల్గొన్నారు.