చెరువులపై ముదిరాజ్ లకు మాత్రమే హక్కులుండాలి

చెరువులపై ముదిరాజ్ లకు మాత్రమే హక్కులుండాలి
  • అఖిల భారతీయ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కువర్జి భావాలియా

సికింద్రాబాద్: చెరువులపై ముదిరాజ్ లకు మాత్రమే హక్కులు ఉండాలని అఖిల భారతీయ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కువర్జి భావాలియా డిమాండ్ చేశారు. ముదిరాజ్ మహా సభ  100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్ల గురించి చర్చించేందుకు ఆదివారం సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో ఉన్న ముదిరాజ్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కువర్జి భావాలియా మాట్లాడుతూ  ముదిరాజ్ మహా సభ  100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 22 వతేదీన హైదరాబాద్ లో పెద్ద బహిరంగ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముదిరాజ్ లను  బీసీ డి నుండి బీసీ ఏ కి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. 
మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ ఆశయసాధన కోసం అందరం పాటు పడాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ లను బీసీ డి నుండి బీసీ ఏ కు మార్చే విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలన్నారు. 
ముదిరాజ్ సంస్కృతిని కాపాడుతూ మహాసభ నడపడం మంచి పరిణామం
కేందర్ మాజీ మంత్రి సాద్వి నిరంజని జ్యోతి మాట్లాడుతూ 100 ఏండ్ల నుండి ముదిరాజ్ సంస్కృతిని కాపాడుతూ ముదిరాజ్ మహాసభ ను  నడపడం మంచి పరిణామం అన్నారు. నవాబులు, నిజాంల కాలంలోనే ముదిరాజ్ మహాసభ ఏర్పాటు చేసి ముదిరాజ్ హక్కుల కోసం పోరాటం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పేద ప్రజల కోసమే ప్రధాని మోడీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గతంలో ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చేసేవారు...కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికలతో సంబంధం లేకుండా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నామన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించింది మోడీ ప్రభుత్వమేనని వివరించారు.