కాళేశ్వరం.. ఒక్క రోజు మురిపెమే!

కాళేశ్వరం.. ఒక్క రోజు మురిపెమే!
  • 1 టీఎంసీ వాటర్‌‌ లిఫ్ట్‌‌ ఒక్క రోజే
  • కన్నెపల్లిలో నాలుగు మోటార్లతోటే లిఫ్టింగ్‌‌
  • ప్రాణహిత నదికి తగ్గిన ఇన్‌‌ఫ్లో
  • 27 వేల క్యూసెక్కుల నుంచి 20 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి అర టీఎంసీ వాటర్‌‌ పంపింగ్‌‌
  • రాత్రివేళ అన్ని చోట్ల మోటార్లు బంద్‌‌

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ నుంచి ప్రతిరోజూ ఒక టీఎంసీ వాటర్​ను‌ లిఫ్ట్​ చేస్తామన్న సర్కారు మాట ఒక్కరోజు మురిపెమే అయ్యింది. ‘కరువు ఉన్నప్పుడే కాళేశ్వరం విలువ తెలుస్తది’ అని కామెంట్ చేసిన సీఎం కేసీఆర్​ ఆదేశాలతో ఆఫీసర్లు సోమవారం మేడిగడ్డలో నాలుగు మోటార్ల ద్వారా పంపింగ్​ ప్రారంభించారు. సాయంత్రం వరకు ఆరు మోటార్లకు పెంచి, టీఎంసీ వాటర్‌‌ను ఎత్తిపోస్తున్నట్లు ప్రకటించారు. తీరా మంగళవారం ప్రాణహిత వద్ద వరద తగ్గడంతో కన్నెపల్లి పంప్‌‌హౌస్​‌ వద్ద రెండు మోటార్లను బంద్​పెట్టి, నాలుగు మోటార్లను మాత్రమే నడిపించారు. మధ్యమధ్యలో ఐదు, ఆరు మోటార్లను చెక్‌‌ చేసుకుంటూ వచ్చారు. 

ఇక సోమ, మంగళవారాల్లో రాత్రిపూట అన్ని మోటార్లను బంద్‌‌ పెట్టారు. బుధవారం కూడా సేమ్‌‌ టు సేమ్‌‌ నాలుగు మోటార్లను రన్‌‌ చేస్తున్నారు. దీంతో సీఎం చెప్పినట్లు రోజుకు టీఎంసీ కాకుండా కేవలం అర టీఎంసీ వాటర్‌‌ ను మాత్రమే లిఫ్ట్‌‌ చేయగలుగుతున్నారు. అన్నారం, సుందిళ్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఆ రెండు చోట్ల నాలుగు మోటార్లతో వాటర్‌‌ లిఫ్ట్‌‌ చేస్తున్నట్లుగా ఆఫీసర్లు ప్రకటించారు. కానీ ఇక్కడ కేవలం రెండు మోటార్లు మాత్రమే నిరంతరాయంగా నడిపిస్తున్నారు. మిగిలిన రెండు మోటార్లను మధ్యమధ్యలో ఆపుతూ నడిపిస్తున్నారు.

ప్రాణహితకు తగ్గిన వరద

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ వాటర్‌‌ లిఫ్టింగ్‌‌కు ప్రాణహిత నది నీరే ఆధారం. మహారాష్ట్రలో వార్ధా, పెన్‌‌ గంగ ఉప నదుల నీళ్లు ప్రాణహితలో కలిసి ప్రవహిస్తాయి. కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమంలో గోదావరితో కలుస్తాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ మూడు రోజుల కింద మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో సోమవారం ప్రాణహితలో వరద 27వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఆఫీసర్లు కన్నెపల్లి దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ ఆరు మోటార్లను రన్‌‌ చేయడం ప్రారంభించారు. కానీ మంగళవారం ఉదయానికి  ఇన్‌‌ ఫ్లో 15 వేల క్యూసెక్కులకు పడిపోయింది. వెంటనే అధికారులు రెండు మోటార్లను బంద్‌‌ పెట్టి, కేవలం నాలుగు మోటార్లతో వాటర్‌‌ లిఫ్ట్‌‌ చేశారు. బుధవారం ఇన్‌‌ఫ్లో 20 వేల క్యూసెక్కులకు పెరిగినా నాలుగు మోటార్లే నిరంతరాయంగా నడిపించారు. 

కన్నెపల్లిలో ఆరు మోటార్లు 24 గంటల పాటు నిరంతరాయంగా రన్‌‌ అయితే 12 వేల క్యూసెక్కుల వాటర్‌‌( సుమారు ఒక టీఎంసీ) లిఫ్ట్‌‌ చేస్తాయి. కానీ నాలుగు మోటార్లు నిరంతరాయంగా నడిపిస్తూ, మరో రెండు మోటార్లను మధ్యమధ్యలో నడిపించడం, రాత్రివేళ మోటార్లను బంద్‌‌ చేయడం వల్ల ఒక రోజులో ఆఫ్‌‌ టీఎంసీ వాటర్‌‌ మాత్రమే లిఫ్ట్‌‌ చేసినట్లు అవుతుందని ఇరిగేషన్‌‌ నిపుణులు చెబుతున్నారు. నిజానికి కన్నెపల్లి వద్ద 17 మోటార్లను ఓకేసారి నడిపితే మూడు టీఎంసీల నీళ్లను ఎత్తిపోయవచ్చు. అదనపు టీఎంసీ కోసం పెట్టిన 5 మోటార్లు  దెబ్బతినడంతో ప్రస్తుతం  12 రన్నింగ్​ కండీషన్​లో ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అందులో సగం మోటార్లను కూడా నడపలేని పరిస్థితి ఉంది. కన్నెపల్లి పంప్‌‌హౌజ్‌‌ నుంచి బుధవారం కేవలం 5 వేల క్యూసెక్కుల వాటర్‌ ను‌ మాత్రమే లిఫ్ట్‌‌ చేసినట్లు అఫీషియల్‌‌ రిపోర్ట్‌‌లో చూపించారు.

అన్నారం, సుందిళ్ల నుంచి అర టీఎంసీ మాత్రమే లిఫ్టింగ్​

అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌‌ల నుంచి రోజుకు కేవలం అర టీఎంసీ వాటర్​ను మాత్రమే ఎగువకు లిఫ్ట్‌‌ చేస్తున్నారు. కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌‌లలో రాత్రివేళ మోటార్లు బంద్‌‌ చేయడం వల్ల సర్కారు అనుకున్న స్థాయిలో వాటర్‌‌ లిఫ్టింగ్‌‌ జరగట్లేదని నిపుణులు చెబుతున్నారు. వాటర్‌‌ లిఫ్టింగ్‌‌ జరిగే పంప్‌‌హౌస్​ల దగ్గరికి ఆఫీసర్లు ఎవర్నీ రానివ్వట్లేదు. ప్రైవేట్‌‌ సెక్యూరీటీ గార్డ్‌‌లను ఏర్పాటు చేసి పంప్‌‌హౌస్​‌ల లోపలికి ఎవర్నీ రాకుండా అడ్డుకుంటున్నారు. గేట్లకు తాళాలు తీయట్లేదు. దీనివల్ల ఆఫీసర్లు ఏం చెబితే.. అదే ఫైనల్‌‌ అనే తీరులో సర్కారు శైలి కన్పిస్తోంది.

నాలుగు బ్యారేజ్‌‌ల్లో 28 టీఎంసీలే

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో  భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌‌లతో పాటు ఎల్లంపల్లి బ్యారేజ్‌‌లో కలిపి 56 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 28 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. బుధవారం ఈ నాలుగు బ్యారేజ్‌‌ల వాటర్‌‌ కెపాసిటీ  పరిశీలించగా మేడిగడ్డ బ్యారేజ్‌‌లో 16.17 టీఎంసీలకు 7 టీఎంసీలు, అన్నారం బ్యారేజ్‌‌లో 10.87 టీఎంసీలకు 7.1, సుందిళ్ల బ్యారేజ్‌‌లో 8.8 టీఎంసీలకు 4.6, ఎల్లంపల్లి బ్యారేజ్‌‌లో 20.17 టీఎంసీలకు 11.64 టీఎంసీల వాటర్‌‌ మాత్రమే నిల్వ ఉంది. కన్నెపల్లి పంప్‌‌హౌస్​‌ దగ్గర మొత్తం 17 మోటార్లు ఉన్నాయి. ఒకే సారి మొత్తం మోటార్లను ఆన్‌‌ చేసి రన్‌‌ చేస్తే కేవలం 2 రోజుల్లో బ్యారేజ్‌‌ మొత్తం ఖాళీ అవుతుంది. అలాగే మిగతా బ్యారేజ్‌‌లలో ఏర్పాటు చేసిన మొత్తం మోటార్లను ఒకేసారి ఆన్‌‌ చేస్తే కేవలం రెండు మూడు రోజుల్లో వాటర్‌‌ ఖాళీ అవుతుంది. అందుకే ఆఫీసర్లు మొత్తం మోటార్లను ఒకేసారి రన్‌‌ చేయకుండా కొన్నింటిని మాత్రమే రన్‌‌ చేస్తున్నారు.