ఒక్కో కుటుంబానికి రెండు బిందెల నీళ్లే 

ఒక్కో కుటుంబానికి రెండు బిందెల నీళ్లే 
  • సరిపోక కొట్టుకుంటున్నరు
  • బస్తీల్లో తాగునీటి సమస్యలు
  • కాలనీల్లో పైపుల లీకేజీలు 
  • పట్టించుకోని వాటర్ బోర్డు

హైదరాబాద్(ఎల్బీ నగర్),వెలుగు: సమ్మర్ లో బస్తీల్లో తాగునీటి సమస్య మొదలైంది. మరో వైపు కాలనీల్లో వాటర్ లీకేజీల అవుతుండగా ఇబ్బందులు వస్తున్నాయి. బస్తీవాసులు బిందెలు, బకెట్లు పట్టుకొని గంటల తరబడి నల్లాల వద్ద ఎదురు చూస్తూ నీటికోసం చివరకు కొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఒక్కో కుటుంబానికి రెండు బిందెల నీళ్లు మాత్రమే దొరుకున్నాయి.  రెండు రోజులకు ఓ సారి వచ్చే నీటి కోసం బస్తీ వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎల్బీనగర్సెగ్మెంట్ లోని నాగోల్ సాయినగర్ బస్తీలో వారం రోజులుగా రెండు రోజులకు ఓ సారి గొడవే అవుతుంది.  బస్తీలో 600 కుటుంబాలు ఉండగా, 40 కుటుంబాలకు ఒక నల్లా ఉంది. రెండు రోజులకు ఓసారి గంట పాటే నీరు వస్తుంది. దీంతో అవి ఎవరికి సరిపోక కొట్టుకుంటున్నారు. సర్కార్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి యేడు సమ్మర్లో  నీళ్ల కోసం కొట్టుకుంటున్నామని, ఎవరూ పట్టించుకోవడం లేదని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.  
పైపుల లీకేజీలతో నీరంతా..
మరో వైపు లీకేజీల కారణంగా నీరంతా వృథాగా పోతుంది. చిన్న లీకేజీనే అని స్థానిక వాటర్బోర్డు అధికారులు లైట్ తీసుకుంటుండగా నీరంతా రోడ్లపై పారుతోంది. వరద రోడ్డుపై బ్లాక్ అవుతుందగా కాలనీవాసులు  ఇబ్బందులు పడుతున్నారు. పైపుల లీకేజీలను అధికారులు పట్టించుకోవడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఎల్బీనగర్ సిరీస్ రోడ్డులో రెండు చోట్ల రెగ్యులర్ గా లీకేజీలు అవుతున్నాయి. నీరంతా స్థానికంగా ఉన్న వాస్తు కాలనీ, సిరినగర్ కాలనీల్లోకి చేరడంతో రోడ్లు వరదనీటితో వర్షాకాలాన్ని తలపిస్తున్నాయి.  లీక్ అవుతున్న ఏరియాల్లో ఓ గుంత  ఏర్పడుతుండగా స్థానికులు కర్రలను డేంజర్ గుర్తులుగా పెడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే  లీకేజీలు అవుతున్నాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. లీకేజ్ లు తమ దృష్టికి వస్తే రిపేర్ చేస్తున్నామని, రోడ్ కట్టింగ్ లాంటివి ఉంటే  ఆలస్యమవుతుందని సాహెబ్నగర్ వాటర్బోర్డు జీఎం సుబ్బారాయుడు చెబుతున్నారు. సమ్మర్ లో నీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.