శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కొత్త రూల్: స్టూడెంట్ తోపాటు ముగ్గురికే అనుమతి

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కొత్త రూల్: స్టూడెంట్ తోపాటు ముగ్గురికే అనుమతి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కూడా సెక్యూరిటీ ఆఫీసర్లు హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టు ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా సంస్థలు సెక్యూరిటీని అలర్ట్ చేశాయి. విదేశాలకు చదువుల  నిమిత్తం వెళ్లే స్టూడెంట్స్ తమ వెంట సెండ్​ఆఫ్​ ఇవ్వడానికి ముగ్గురిని మాత్రమే తీసుకురావాలని.. ఎక్కువ మందిని తీసుకువస్తే లోపలికి రావడానికి పర్మిషన్​ ఉండదని అధికారులు చెబుతున్నారు.  

సీఐఎస్ఎఫ్ స్పెషల్ పోలీస్, స్టేట్ పోలీస్ లను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. దీంతో ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అధికారులు లోనికి అనుమతిస్తున్నారు.  మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో సందర్శకులకు అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 

ఆగస్ట్ 28వ తేదీ వరకు సందర్శకులను అనుమతించబోమని స్పష్టం చేశారు. అప్పటి వరకు విజిటింగ్ పాసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో, హైదరాబాద్ విమానాశ్రయం యాక్సెస్ రోడ్డు, ర్యాంపులలో రద్దీ కారణంగా ఇబ్బందులను ఎదుర్కుంటోంది.

ALSO READ :బోర్డు తిప్పేసిన కన్సల్టెంట్ ​ఏజెంట్.. బాధితుల ఆందోళన

రద్దీ పెరిగితే ఇబ్బందులు..

శంషాబాద్ విమానాశ్రయం నుండి విదేశాలకు వెళుతున్న వారి వెంట ఎక్కువ సంఖ్యలో బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు రావద్దని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి సూచించారు. ఒక్క ప్రయాణికుని వెంట పది నుండి 15 మంది వరకు వస్తుండటంతో ఎయిర్ పోర్టులో రద్దీ పెరుగుతోందన్నారు. 

దీంతో సెక్యూరిటీ సమస్యతో పాటు..పార్కింగ్ సమస్యలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఒక ప్రయాణికుడి వెంట ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఎయిర్ పోర్టుకు రావాలని చెప్పారు.