హిస్టరీ : ఊటీ రైల్వేస్టేషన్ కు 115 ఏళ్లు

హిస్టరీ : ఊటీ రైల్వేస్టేషన్ కు 115 ఏళ్లు

ఊటీ .. అందరూ ఒక్కసారైనా చూడాలనుకునే ప్రదేశం..  తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లా, నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఈ ఊటీ అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి.  వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వెళ్లేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఊటీ ప్లేస్ మాత్రమే కాదు. అక్కడి ఉండే   రైల్వేస్టేషన్ కి కూడా ఓ చరిత్ర ఉంది.  ఊటీలో నడుస్తున్న మౌంటెన్ హిల్ రైల్వే టాయ్ ట్రైన్ సర్వీస్ ఆదివారంతో 115 ఏళ్లు పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా  స్థానిక ప్రజలు, పర్యాటకులు ఘనంగా కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు నిర్వహించారు.  

 అంతేకాకుండా అక్కడి స్థానికులు తమ మాతృభాషలో రైలు గురించి పాటలు పాడుతూ సంప్రదాయ నృత్యాలు చేస్తూ పర్యాటకుల దృష్టిని ఆకర్షించారు.  1899జూన్ 15,న మెట్టుపాళయం, కూనూర్ మధ్య ప్రారంభమై, తరువాత 1909 అక్టోబర్ 15న ఉదగై హిల్ స్టేషన్‌ వరకు విస్తరించబడింది.  ప్రతి సంవత్సరం అక్టోబర్ 15ని నీలగిరి మౌంటైన్ రైల్వే డేగా జరుపుకుంటారు. ఆసియాలోనే అతి పొడవైన, ఏటవాలుగా ఉన్న మీటర్ గేజ్ రైల్వేగా గుర్తింపు పొందింది. UNESCO 2005 జూలై 15న నీలగిరి మౌంటైన్ రైల్వేను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

దక్షిణ భారతదేశంలో ప్రతిరోజూ నడిచే ఏకైక పర్వత రైలు ఇదే . వేసవి కాలంలో పర్యాటకుల రాక పెరిగే కొద్దీ రైలు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మెట్టుపాళయం నుండి కూనూర్ మీదుగా ఊటీకి టాయ్ ట్రైన్ నడుస్తుంది. రైలు ట్రాక్ మొత్తం పొడవు 46 కిలోమీటర్లు. ఈ రైలులో ఫస్ట్ క్లాస్ మరియు సెకండ్ క్లాస్ టిక్కెట్లు రెండూ ఉన్నాయి. టాయ్ ట్రైన్ సౌత్ ఇండియన్ సినిమాలతో సహా చాలా సినిమాల్లో కనిపించింది.