దసరా ఉత్సవం : 7 లక్షల లైట్లతో.. 30 కిలోమీటర్లు డెకరేషన్

దసరా ఉత్సవం : 7 లక్షల లైట్లతో.. 30 కిలోమీటర్లు డెకరేషన్

దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రిళ్లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దుర్గామాత  ప్రతి రోజూ ఒక్కో అవతారంలో దర్శనమిస్తున్నారు.  చాలా వీధుల్లో అమ్మవారి అనుగ్రహం పొందడానికి భక్తులు  మండపాలు ఏర్పాటు చేసి నవరాత్రిళ్ల పూజలు నిర్వహిస్తున్నారు.  మైసూర్ లో జరిగే నవరాత్రి ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంతరించుకుంది.  ఇప్పుడు తాజాగా కర్ణాటకలోని మంగళూరులోని కుద్రేలి ప్రాంతం దసరా పండుగ సందర్భంగా  వెలుగులు జిమ్ముతున్నాయి.  ఈ ప్రాంతంలో 30 కిలోమీటర్ల మేర 7 లక్షల బల్బులతో  లైటింగ్ అమర్చారు.  

కర్నాటకలోని కుద్రోలి ప్రాంతంలో  దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  కుద్రోలి ప్రాంతంలో శ్రీ శ్రీ గోకర్ణనాథేశ్వర క్షేత్రాన్ని  రంగు రంగుల దీప కాంతులతో అలంకరించారు. ఈ ప్రాంతానికి వచ్చే 30 కిలోమీటర్ల రహదారికి ఇరువైపులా లైటింగ్ ఏర్పాటు చేశారు.   ఈ ఏడాది (2023)  వీధుల అలంకారానికి.. అమ్మవారి మండపానికి మొత్తం 30 లక్షల బల్బులను ఉపయోగించామని నిర్వాహకులు తెలిపారు.   వీటిలో 14 లక్షల బల్బులు ఎక్కువ కాంతిని విరజిమ్ముతాయి.  గతేడాది (2022) లో 25 లక్షల బల్బులతో అలంకారం చేశామని... ఈఏడాది మరో 5 లక్షలు పెంచామన్నారు. 

కర్నాటకలోని కుద్రోలి ప్రాంతం దసరా నవరాత్రిళ్లు ప్రారంభమైన రోజునుంచి ఉత్సవాలు ముగిసేవరకు విద్యుత్ దీపాలంకరణ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.  ఈ దీపాలంకరణకు  భక్తుల నుంచి సేకరించిన విరాళాలలో  ఆరు లక్షల రూపాయిలను ఖర్చు చేశారు.   ఈ ప్రాంతంలో జరిగే నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు.  

మైసూర్‌లోని దసరా వేడుకలు అలనాటి  వైభవానికి ప్రసిద్ధి చెందాయి.  జగన్మోహన్ ప్యాలెస్, టౌన్‌హాల్,  కళామందిరతో సహా వివిధ ప్రదేశాలలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి.  20వ శతాబ్దంలోని  మైసూర్ ప్యాలెస్ ను దసరా పండుగ సందర్భంగా  ప్రతి ఏడాది95వేల  లైట్లతో అలంకరిస్తారు.  దసరా పండుగ  10 రోజుల వేడుకలో రాత్రి 7 నుండి 10 గంటల వరకు ఆ లైట్లు వెలుగుతూ ఉంటాయి. చాముండి కొండపై నున్న చాముండేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.