కారకస్/ఓస్లో: వెనెజులా ప్రతిపక్ష నేత, ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విజేత మరియా కొరీనా మచాడో అకస్మాత్తుగా ఓస్లోలో ప్రత్యక్షమయ్యారు. ఏడాదికాలంగా అజ్ఞాతంలోనే ఉన్న ఆమె తొలిసారిగా ప్రజల ముందుకొచ్చారు. ఓస్లోకు చేరుకున్న ఆమె నోబెల్ బహుమతిని అందుకుంటారని అందరూ భావించారు. అయితే, ఈ కార్యక్రమానికి మచాడో హాజరుకాలేదు. దీంతో ఆమె కుమార్తె అనా కొరీనా సోసా నోబెల్ బహుమతిని స్వీకరించారు.
ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటలకే మచాడో బహిరంగంగా కన్పించారు. నార్వేలోని ఓ హోటల్ వద్ద తన మద్దతుదారులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అయితే, వెనెజువెలాలో నిర్బంధం నుంచి తప్పించుకుని.. నార్వేకు ఆమె ఎస్కేప్ కావడం వెనక అమెరికాకు చెందిన మాజీ సైనికాధికారులు‘ఆపరేషన్ గోల్డెన్ డైనమైట్’ పేరుతో సహాయం చేసినట్టుగా తాజాగా వెల్లడైంది.
సముద్రంలో పడవలు మారుస్తూ..
మచాడోను అమెరికా ఆర్మీ మాజీ ఆఫీసర్లకు చెందిన సంస్థ ‘గ్రే బుల్ రెస్క్యూ’ ఓస్లోకు చేర్చింది. మాజీ ఆర్మీ వెటరన్ అయిన బ్రయాన్ స్టెర్న్ నేతృత్వంలో ఈ సంస్థ స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించడంలో ఆరితేరినది. వెనెజులా ప్రభుత్వం మచాడోపై అన్నివేళలా నిఘా పెట్టడంతో ఆమెను తరలించడం కష్టతరంగా మారిందని బ్రయాన్ స్టెర్న్ పేర్కొన్నారు. కారకస్ శివారులోని ఓ గ్రామంలో దాక్కున్న మచాడోను తీరప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామానికి ముందుగా తరలించారు.
మిలిటరీ చెక్ పాయింట్లను తప్పిస్తూ ఆమెను ఆ గ్రామానికి చేర్చారు. అక్కడినుంచి ఆమెను ఒక చిన్న సైజు బోటులో ఎక్కించి మరో తీర ప్రాంత గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం అర్ధరాత్రి పూట కరీబియన్ జలాల్లో అనేక పడవల్లో ఆమెను తప్పిస్తూ పది గంటల్లో కురాకావోకు చేర్చారు. బుధవారం తెల్లవారుజామున కురాకావోకు చేర్చిన తర్వాత మచాడోను కొన్ని గంటల అనంతరం ఒక ప్రైవేట్ విమానంలో ఓస్లోకు తరలించారు.
మచాడో ప్రయాణించిన సముద్ర మార్గం అత్యంత కఠినమైనది. ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్‌ను అడ్డుకోవడానికి ఈ మార్గంపై అమెరికా భారీ ఎత్తున నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే పలువురు పౌరులను అగ్రరాజ్యం మట్టుబెట్టడంతో ఆ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు అలుముకున్నాయి. అందువల్ల మచాడో ప్రయాణించే బోటుకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు ఆమె తరలింపు గురించి బ్రయాన్ స్టెర్న్ అమెరికా ఏజెన్సీలను ముందుగానే అప్రమత్తం చేశారు.
మదురో నియంతృత్వ పాలనపై పోరాటం
వెనెజులాలో అధ్యక్షుడు నికోలస్ మదురో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అనేక ఏండ్లుగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి మచాడో సారథ్యం వహిస్తున్నారు. దీంతో ఆమె అనేక బెదిరింపులను ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి గట్టిపోటీదారుగా నిలిచారు. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమె పోటీ చేయకుండా నిషేధించింది. దీంతో మరో అభ్యర్థి ఎడ్మండో గోంజాలెజ్ కు మచాడో మద్దతు పలికారు. మదురోను ఆయన భారీ తేడాతో ఓడించారు. అయితే, అధికారులు మాత్రం కుట్రపూరితంగా వ్యవహరించి మదురోను విజేతగా ప్రకటించారు. మదురో ప్రభుత్వం అణచివేత చర్యలు చేపట్టడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
