గిరిజనులతో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి : దీపాదాస్ మున్షీ

గిరిజనులతో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి : దీపాదాస్ మున్షీ
  •      లోక్‌‌సభ పోరులోనూ గిరిజనులు కాంగ్రెస్​ పార్టీ విజయానికి కృషి చేయాలి  

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో గిరిజనులతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ​పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్​ దీపాదాస్​ మున్షీ సూచించారు. తండా స్థాయిలోనూ నాయకుల మీటింగులు నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శనివారం గాంధీ భవన్‌‌లో ఆదివాసీ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్ అధ్యక్షత వహించగా.. దీపాదాస్ మున్షీ చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. 

కార్యకర్తలు పార్టీ అభ్యర్థులతో కో ఆర్డినేట్ చేసుకుంటూ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, అదే మాదిరిగా రాహుల్​ను ప్రధాన మంత్రిని చేయడానికి లోక్‌‌సభ ఎన్నికల్లోనూ సహకరించాలని కోరారు. గిరిజన నాయకులకు ఏ సమస్య ఉన్నా పార్టీ నాయకత్వం చూసుకుంటుందని, అందరితో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు.

 ఎన్నికల అనంతరం గిరిజనులకు ప్రాధాన్యం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు కాంగ్రెస్​కు ఓటు వేసి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారో.. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఆర్ రఘు నాయక్, రాష్ట్ర కో ఆర్డినేటర్లు గణేశ్​ నాయక్, భిక్షపతి నాయక్, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.