హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు.. నల్గొండలో రూ.75 వేల 500 పలికిన చదరపు గజం

హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు.. నల్గొండలో రూ.75 వేల 500 పలికిన చదరపు గజం

నల్గొండ, వెలుగు: నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఓపెన్ ప్లాట్లు వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. బోర్డు నిర్దేశించిన ధర కంటే మూడు రెట్లకు పైగానే పలికాయి.

కాలనీలోని మొత్తం 31 ఓపెన్ ప్లాట్లను వేలం వేసేందుకు గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన బోర్డు సోమవారం బహిరంగ వేలం నిర్వహించింది.233 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్లకు.. చదరపు గజానికి రూ. 20 వేలు కనీస ధరగా నిర్ణయించారు. వేలంలో 201 బిడ్డర్లు పాల్గొన్నారు.

ప్లాట్లకు పోటీ ఎక్కువగా ఉండడంతో బోర్డు నిర్దేశించిన ధర కంటే మూడు రెట్లకు పైగా ధర పలికింది. వేలంలో చదరపు గజానికి కనీస ధర రూ. 55,500 పలుకగా.. గరిష్ఠంగా రూ. 75,500 పలికింది. ఈ ప్లాట్ల వేలం ద్వారా బోర్డుకు రూ. 44.15 కోట్ల ఆదాయం వచ్చిందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ.గౌతమ్ తెలిపారు. నల్గొండ అవుటర్  రింగ్ రోడ్ కు సమీపంలో ఈ ప్లాట్లు ఉండడం, ఎలాంటి వివాదాలు లేకపోవడంతో బహిరంగ వేలంలో మంచి రేటు పలికాయని చెప్పారు.