
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలో హైడ్రా ఆదివారం క్లీనింగ్ చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ బతుకమ్మ కుంట’ పేరుతో ఇన్‌స్పెక్టర్ బాలగోపాల్ ఆధ్వర్యంలో డీఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పూల వ్యర్థాలను తొలగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బతుకమ్మ కుంటను ప్రారంభించిన తర్వాత మూడు రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరిగాయి. పెద్ద మొత్తంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఎప్పటికప్పుడు పూల వ్యర్థాలను బయటకు తీసినా కొన్ని మునిగిపోయాయి. దీంతో మిగిలిన వ్యర్థాలను ఆదివారం తొలగించారు. మరోవైపు, బతుకమ్మ కుంటను సుందరంగా తీర్చిదిద్దినా ఇంటింటికి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలను అక్కడ పార్కింగ్చేస్తున్నారు. ఫలితంగా కుంట పరిసరాల్లో దుర్వాసన వస్తుండడంతో తాజాగా వాటికి ప్రత్యామ్నాయం చూపారు.
సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర పార్కింగ్ సౌకర్యాన్ని హైడ్రా కల్పించింది. దీంతో బతుకమ్మ కుంట ప్రధాన ద్వారం వద్ద ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఇప్పుడు బతుకమ్మకుంట వద్ద ఎటువంటి ఇబ్బందులు లేవు.