
ములుగు/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : తెలంగాణ, చత్తీస్‌గఢ్ బార్డర్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆదివాసీ, గిరిజన, ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ములుగులోని డీఎల్‌ఆర్ ఫంక్షన్‌హాల్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించగా, కొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో గల ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రెగుట్టల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని, కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. చర్చలకు సిద్ధమేనని మావోయిస్ట్ పార్టీ సైతం ప్రకటించిందని, ప్రభుత్వం ముందుకు వచ్చి చర్చలు జరిపి ఆదివాసుల హక్కుల కాపాడాలన్నారు.
ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సైతం చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ దివాకర టీఎస్‌కు, మంత్రి సీతక్కకు వినతిపత్రాలు అందజేశారు. ములుగులో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, గోర్ సభ జాతీయ అధ్యక్షుడు జై సింగ్ రాథోడ్, తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్, శాంతి చర్చల కమిటీ సభ్యులు సోమ రామ్మూర్తి, ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, ట్రైబల్ డెమొక్రటిక్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్‌సింగ్, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంపిడి వెంకటేశ్వర్లు, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమ్మయ్య రాథోడ్, కొత్తగూడెంలో నాయకులు మల్లెల రామనాథం, గౌని నాగేశ్వర్‌రావు, సంజీవరావు, తుపాకుల నాగేశ్వరరావు, ఉపేందర్‌రావు, బాబు పాల్గొన్నారు.
మావోయిస్టులతో చర్చలు జరపాలి : మంత్రి సీతక్క
ఆదివాసీ, గిరిజన, ప్రజాసంఘాల ప్రతినిధులు ములుగులో ర్యాలీ నిర్వహించిన అనంతరం క్యాంప్ ఆఫీస్‌లో మంత్రి సీతక్కను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు. కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఆదివాసుల జీవనానికి ఇబ్బంది కలుగకుండా చర్యల తీసుకోవాలన్నారు.