
- మహబూబాబాద్ జిల్లాలో మరో 40 మంది సంరక్షణ కేంద్రాలకు
- జులై 1 నుంచి 31 వరకు స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆఫీసర్లు
వరంగల్/ మహబూబాబాద్, వెలుగు: ఓరుగల్లులో నెల రోజులపాటు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్– 11 కార్యక్రమం ఈ ఏడాది 200 మంది బాలలను విముక్తి కలిగించింది. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా జులై నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖలతో పాటు పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. దీంతో వివిధ కంపెనీలు, షాపుల్లో పనిచేస్తున్న చిన్నారులతోపాటు తప్పిపోయిన పిల్లలు, భిక్షాటన చేస్తున్న బాలబాలికలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
బాలకార్మికుల సంరక్షణ కోసం..
బాలకార్మికుల సంరక్షణ ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా జులైలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఆపరేషన్ ముస్కాన్_11 లో భాగంగా బాలల సంక్షేమ కమిటీ, పోలీస్, కార్మిక, విద్యాశాఖ, జాతీయ బాలకార్మిక నిర్మూలన సంస్థ ఆఫీసర్లు సమన్వయంతో బాలకార్మికులను గుర్తించారు.
వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిలో పనిచేసే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక టీంలు పనిచేయగా, మహబూబాబాద్ జిల్లా పరిధిలో తొర్రూరుతోపాటు మహబూబాబాద్ డివిజన్లోని హోటల్స్, ఇటుక బట్టీలు, కంపెనీలు, మెకానిక్ షాపులు, మైనింగ్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనాథ శరణాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, బాల సదనాల నుంచి తప్పిపోయిన చిన్నారులను గుర్తించారు. భిక్షాటన చేస్తున్న పిల్లలను సైతం గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలు, సంక్షేమ వసతి గృహాల్లో చేర్పించేలా చర్యలు చేపట్టారు.
కమిషనరేట్లో 177 మంది.. మానుకోటలో 40 మంది
ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరుతో జులై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కలెక్టర్లతోపాటు పోలీస్ కమిషనర్ సన్‍ప్రీత్‍సింగ్, మహబూబాబాద్ జిల్లాలో ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్నేతృత్వంలో బాలకార్మికులను గుర్తించడానికి ప్రత్యేక తనిఖీలు కొనసాగించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 177 మంది బాలబాలికలను గుర్తించి సంరక్షణ గృహాలకు తరలించారు. ఇందులో 149 మంది బాలలు, 28 మంది బాలికలు ఉన్నారు.
177 మందిలో ఇతర రాష్ట్రాలకు చెందిన 97 మంది ఉన్నట్లు గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఈ ఏడాది 40 మంది బాలలను గుర్తించగా, వీరిని పనుల్లో పెట్టుకున్న 20 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ జిల్లాలో 2014లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 221 మంది బాలలను గుర్తించగా, 2015 లో 150 మంది, 2016లో 25 మంది, 2017_18లో మొత్తం 59 మంది బాల కార్మికులను గుర్తించారు. 2021లో 127 మంది, 2022లో 35 మంది, 2023లో 28, 2024లో 20 మందిని గుర్తించి వీరితో పనులు చేపిస్తున్నవారిపై కేసులు నమోదు చేశారు.
వెట్టిచాకిరి చేపిస్తే కేసులు తప్పవు..
వరంగల్ కమిషనరేట్, మహబూబాబాద్ జిల్లా పరిధిలో 14 ఏండ్లలోపు పిల్లలతో పనులు చేపిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. బాలల న్యాయచట్టం అనుసరించి చిన్నారులను పనిలో పెట్టుకునేవారిపై 2 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తున్నాం. జిల్లాల్లో బాలలతో వెట్టిచాకిరి పనులు చేయిస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచి, నిందితులపై చర్యలు తీసుకుంటాం. వివిధ శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది.