
- 148 బాలురు, ఆరుగురు బాలికల పేరెంట్స్‌కు కౌన్సిలింగ్
- స్కూల్స్‌లో చేర్పించేందుకు ఏర్పాట్లు
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో నెల రోజుల పాటు కొనసాగిన ఆపరేషన్ ముస్కాన్తో 154 మంది చిన్నారులకు అధికారులు విముక్తి కల్పించారు. జూలై నెలంతా కొనసాగిన డ్రైవ్‌లో 148 మంది బాలురు, ఆరుగురు బాలికలను గుర్తించారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న 36 మందిపై కేసులు నమోదు చేశారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించిన ఆపరేషన్ ముస్కాన్‌లో పోలీస్ శాఖతో పాటు, చైల్డ్ ప్రొటెక్షన్, లేబర్, మెడికల్, ఎడ్యుకేషన్ ఆఫీసర్ల టీం జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టి 18 ఏండ్లలోపు పిల్లలను గుర్తించి సర్కార్ బడుల్లో చేర్పించాలని నిర్ణయించారు.
తల్లిదండ్రులపై టీం సీరియస్..
జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ల వారీగా బాల కార్మికుల గుర్తింపు జూలై నెలంతా సాగింది. పలు కార్యక్రమాలతో ప్రజలను ఆకర్షిస్తున్న సీపీ సాయిచైతన్య ఆపరేషన్ ముస్కాన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బడుల్లో చదువుకోవాల్సిన పిల్లలతో పనులు చేయిస్తున్న 36 మందిపై కేసులు నమోదయ్యాయి. హోటల్స్, టీస్టాల్స్, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపుల్లో, పాల కేంద్రాలు, కూల్ డ్రింక్ షాపుల్లో తనిఖీలు కొనసాగాయి. మేకలు, గొర్రెలు, గేదెలు మేపడం, వ్యవసాయ పనుల కోసం పిల్లలను జీతానికి పెట్టుకున్న రైతులనూ గుర్తించారు.
మొత్తం 154 మంది చిన్నారులకు విముక్తి కలిగింది. హోటళ్లలో పని చేస్తున్న ఆరుగురు బాలికల తల్లిదండ్రులపై ఆఫీసర్లు సీరియస్ అయ్యారు. బాయ్స్‌ను పనుల్లో పెట్టుకున్న వారితో మరోసారి తప్పు చేయమని లెటర్స్ రాయించుకున్నారు. వారి పేరెంట్స్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. 6- నుంచి 14 ఏండ్ల వయస్సు చిన్నారులకు ఉన్న నిర్బంధ విద్యా హక్కుచట్టాన్ని వివరించారు. సర్కార్ బడుల్లో చేర్పిస్తే ఫ్రీ చదువు, యూనిఫారం, బుక్స్, మధ్యాహ్న భోజనం ఉంటాయని తెలిపారు. చిన్నారులను స్కూళ్లలో చేర్పించాక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారు. తప్పిపోయిన పిల్లలను బాల సంరక్షణ సెంటర్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు..
పేరెంట్స్ చెంతకు చేర్చాం..
మిస్సింగ్, పేరెంట్స్ వదిలేసిన పిల్లలతో పాటు బాల కార్మికులను గుర్తించడానికి ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించాం. చట్టాన్ని ఖాతరు చేయక పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేశాం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సూచనల ప్రకారం పిల్లలను పేరెంట్స్ వద్దకు చేర్చాం. - సాయిచైతన్య, సీపీ