కేరళలో బిగ్గెస్ట్ స్మగ్లింగ్ రాకెట్.. అడ్డంగా దొరికిపోయిన దుల్కర్ సల్మాన్ !

కేరళలో బిగ్గెస్ట్ స్మగ్లింగ్ రాకెట్.. అడ్డంగా దొరికిపోయిన దుల్కర్ సల్మాన్ !

భూటాన్ నుంచి అక్రమంగా భారత్ కు తీసుకువచ్చిన లగ్జరీ కార్ల స్మగ్లింగ్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది.  దేశ వ్యాప్తంగా కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం అధికారులు "ఆపరేషన్ నుమ్‌ఖోర్" చేపట్టారు. ఇందులో భాగంగా కేరళలో సుమారు 30 ప్రాంతాల్లో సోమవారం ( సెప్టెంబర్ 23న )  మెరుపు దాడులు చేపట్టారు.  ఈ దాడుల్లో సినీ తారలు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, అమిత్ చొక్కాలకల్ నివాసాలతో సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు.

 "ఆపరేషన్ నుమ్‌ఖోర్" సంచలనం విషయాలు వెలుగులోకి..

కేరళలో చేపట్టిన  "ఆపరేషన్ నుమ్‌ఖోర్" లో సంచలనం విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడుల్లో 36 హై-ఎండ్ లగ్జరీ కార్లను సీజ్ చేసినట్లుకొచ్చి కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ కమిషనర్ టి. తిజు వెల్లడించారు. భూటాన్ నుండి అక్రమంగా భారత్‌కు తీసుకువచ్చిన ఈ వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేసినట్లు కనుగొన్నారు. ఈ నకిలీ పత్రాలలో ముఖ్యమంగా భారత సైన్యం ,  యూఎస్ ఎంబసీ వంటి కీలక సంస్థల పేరు, ముద్రలు, చిహ్నాలను ఫోర్జరీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సంస్థలకు చెందిన వాహనాలుగా కొనుగోలుదారులను తప్పుదారి పట్టించడానికి స్మగ్లర్లు ఈ పద్ధతిని ఉపయోగించారు.

దుల్కర్ సల్మాన్ కు చెందిన రెండు కార్లు సీజ్.. 

ఈ దాడులు కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో చేపట్టారు అధికారులు. ఇప్పటి వరకు  సీజ్ చేసిన 36 వాహనాలలో, నటుడు దుల్కర్ సల్మాన్ కు చెందిన రెండు కార్లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, పృథ్వీరాజ్ కు చెందిన ఏ వాహనం కూడా స్వాధీనం చేసుకోలేదు.  ఈ సెలబ్రిటీలు తెలిసో తెలియకో ఇలాంటి వాహనాలను కొనుగోలు చేసి ఉండవచ్చుజ. వారి వాంగ్మూలాలను నమోదు చేస్తామని, పత్రాలను పరిశీలిస్తామని కమిషనర్ తెలిపారు. అక్రమంగా వచ్చినట్లు తేలితే, యజమానులకు తెలిసినా తెలియకపోయినా వాహనాలను సీజ్ చేస్తామని, ఒకవేళ యజమానులకు అక్రమం గురించి తెలిస్తే, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. భూటన్ నుంచి అక్రమంగా వచ్చిన లగ్జరీ కార్లు కేరళలో సుమారు 150- నుంచి 200 వరకు ఉందవచ్చని, మిగిలిన వాటిని కూడా పట్టుకునే వరకు దాడులు కొనసాగుతాయని తిజు తెలిపారు.

భూటన్ నుంచి అక్రమంగా...

భూటన్ నుంచి అక్రమ రవాణా చేసిన ఈ కార్లను పూర్తిగా విడదీసిన (CKD) స్థితిలో, కంటైనర్లలో టూరిస్ట్ వాహనాలుగా దేశంలోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత, మోసపూరితంగా 'పరివాహన్' వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం లేదా లోపలి వ్యక్తులను ఉపయోగించడం ద్వారా పాత వాహనాలుగా, లేదా ఆర్మీ/ఎంబసీకి చెందినవిగా చూపి రిజిస్ట్రేషన్ వివరాలను తారుమారు చేశారు. 2014లో తయారైన కారును వెబ్‌సైట్‌లో 2005 నుంచే వినియోగంలో ఉన్నట్లు చూపించారని కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం అధికారుల విచారణలో తేలింది.

జాతీయ భద్రతకు ముప్పు

కేవలం పన్ను ఎగవేత (ఐటీ, జీఎస్టీ) మాత్రమే కాకుండా, ఈ వాహనాలను బంగారం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు కూడా ఉపయోగించినట్లు కస్టమ్స్ కమిషనర్ తిజు స్పష్టం చేశారు. "కార్లను, బంగారాన్ని, మాదకద్రవ్యాలను ఈ విధంగా అక్రమంగా రవాణా చేయగలిగితే, వారు మరేదైనా తీసుకురాగలరు. అందువల్ల, ఇది దేశ జాతీయ ,  ఆర్థిక భద్రతకు పెద్ద ముప్పు" అని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా, ఈ అక్రమాల ద్వారా వచ్చిన నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.