ప్రతిపక్ష నేతలను జంతువుల్లా వేటాడుతున్నరు

ప్రతిపక్ష నేతలను జంతువుల్లా వేటాడుతున్నరు
  •      సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో రైతులు ఆందోళనలో ఉంటే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలను మాత్రం దర్యాప్తు సంస్థలతో జంతువుల్లా వేటాడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. రాముడిని, కృష్ణుడిని అడ్డంపెట్టుకుని ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేవుళ్లను కలిసే మోదీ.. సమస్యల్లో ఉన్న రైతులను, ప్రజలను ఎందుకు కలవరని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

 కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాయని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. పొత్తులో భాగంగా వయనాడు నుంచి డి.రాజా సతీమణి ఆనీ రాజా పోటీ చేస్తుందని చెప్పారు. దేవుడి విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే మోదీ, రూ.లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లను ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా ప్రజలకు మేలు చేసుంటే ఇన్ని జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు.

 ఢిల్లీ లిక్కర్ స్కాంలో అసలు నిందితులను వదిలేసి.. కేజ్రీవాల్ టీంను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు.