సస్పెన్షన్ ఎత్తేయాలి.. విపక్ష ఎంపీల నిరసన

సస్పెన్షన్ ఎత్తేయాలి.. విపక్ష ఎంపీల నిరసన

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. అయితే సభ మాత్రం సజావుగా సాగడం లేదు. వాయిదాల పర్వం నడుస్తోంది. ప్రతిపక్షాలు నిరసనలకు దిగుతుండటంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నారు. దీంతో ప్రజా సమస్యలపై చర్చకు తావు లేకుండా పోతోంది. ఇవ్వాళ మరోసారి విపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. 12 మంది ఎంపీల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యలు కూడా ఇందులో పాల్గొని.. సస్పెండ్ అయిన ఎంపీలకు మద్దతుగా నిరసనలు తెలిపారు.   

కాగా, వర్షాకాల సమావేశాల చివరి రోజున సభలో గందరగోళం సృష్టించినందుకు 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వీరిని సస్పెండ్ చేస్తూ సభ నిర్ణయం తీసుకుంది. ప్రియాంక చతుర్వేది (శివసేన), డోలా సేన్ (టీఎంసీ), ఎలమారం కరీం (సీపీఎం), కాంగ్రెస్ ఎంపీలు ఫులో దేవి నేతం, ఛాయా వర్మ, ఆర్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, సీపీఐకి చెందిన బినయ్ విశ్వం, టీఎంసీ ఎంపీ శాంత ఛేత్రి, శివసేన ఎంపీ అనిల్ దేశాయ్‌ రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.