VVPAT మిషన్లనే ముందు లెక్కించాలి..విపక్షాల డిమాండ్

VVPAT మిషన్లనే ముందు లెక్కించాలి..విపక్షాల డిమాండ్

న్యూఢిల్లీ:  ఎన్నికల కౌంటింగ్ సమయంలో వీవీప్యాట్​మెషిన్లను ముందు లెక్కించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు విపక్షాల నేతలు చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో ఐదు మెషిన్లలో పోలైన ఓట్లను ఈవీఎంలతో సరిపోల్చాలని, అందులో తేడాలుంటే ఆ నియోజకవర్గంలోని అన్ని వీవీప్యాట్ మెషిన్లను లెక్కించాలని కోరామన్నారు. ఈ లోక్​సభ ఎన్నికల్లో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు వార్తలు వచ్చిన విషయాన్ని వారు గుర్తుచేశారు. మూడు నాలుగేళ్లుగా ఈవీఎంల పనితీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నామని కాంగ్రెస్​పార్టీ సీనియర్​నేత గులాం నబీ ఆజాద్​చెప్పారు. తమ విజ్ఞప్తులపై ఈసీ నెలల తరబడి మౌనం వహించిందని అభిషేక్​సింఘ్వి ఆరోపించారు. ఇప్పుడేమో బుధవారం సమావేశమై ఈ ఆరోపణలపై చర్చిస్తామని జవాబిచ్చిందన్నారు.

ప్రజా తీర్పును గౌరవించాలని, అందులో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని ఈసీకి విజ్ఞప్తి చేశామని టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు చెప్పారు. ఉత్తరప్రదేశ్​కు సంబంధించినంత వరకు ఈవీఎంల పనితీరులో గందరగోళం నెలకొందని, రాష్ట్రంలో భద్రత బలగాల సంఖ్యను పెంచాలని డిమాండ్​చేశామని బీఎస్పీ నేత సతీశ్​చంద్ర మిశ్రా చెప్పారు. ఈవీఎంల ట్రాన్స్​పోర్ట్​విషయంలోనూ ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రాంగ్​రూముల నుంచి లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించే క్రమంలో గట్టి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో 22 ఎన్డీయేతర పక్షాల నేతలంతా సమావేశమయ్యారు. కాంగ్రెస్​పార్టీ నుంచి అహ్మద్ పటేల్, ఆజాద్, అశోక్​గెహ్లాట్, అభిషేక్​సింఘ్వి, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, సతీష్​మిశ్రా(బీఎస్పీ), సీతారాం ఏచూరి(సీపీఎం), డి.రాజా(సీపీఐ), కేజ్రీవాల్(ఆప్), ఒబ్రెయిన్​(టీఎంసీ), రాంగోపాల్​యాదవ్(ఎస్పీ), కనిమొళి(డీఎంకే), మనోజ్​ఝా(ఆర్జేడీ), మజీద్​మెమన్(ఎన్సీపీ), దేవేందర్​రాణా(ఎన్సీ) తదితరులు భేటీలో పాల్గొన్నారు.