- ఓట్ల కోసం స్టేజీ మీద డ్యాన్స్ చేయడానికీ మోదీ సిద్ధపడతడు..
- బిహార్‌లో బీజేపీ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడుపుతోందని ఫైర్
పాట్నా: ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే దేశవ్యాప్త కుల గణనకు మోదీ సర్కారు అంగీకరించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ పాలనలో దేశ సంపద కొంత మంది చేతుల్లోకే వెళ్లిపోతోందని, బిహార్ లాంటి రాష్ట్రాలు పేదరికంలో కూరుకుపోవడానికి ఇదే కారణమన్నారు. నోట్ల రద్దు వల్ల దేశానికి నష్టం జరిగినా.. దీనిపై మోదీ పెదవి విప్పడంలేదని మండిపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందని, ఇప్పుడు బిహార్‌లోనూ అదే జరగబోతోందన్నారు. ఓట్ల చోరీ రాజ్యాంగంపై దాడి లాంటిది అని, రాజ్యాంగాన్ని రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. మహాఘట్ బంధన్ అభ్యర్థలను గెలిపిస్తే బిహార్‌లో సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అన్ని వర్గాల ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు.
ఓట్ల కోసం మోదీ డ్యాన్స్ చేయడానికీ రెడీ..
ఓట్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతదాకైనా వెళ్తారని, స్టేజీ మీద డ్యాన్స్చేయాలని అడిగితే చేసేస్తారని రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల సమయంలో ఆయన ఏదైనా చేస్తారని ఎద్దేవా చేశారు. బిహారీలకు ఛత్ పూజ పెద్ద పండుగ అని, కానీ..భక్తులు కలుషితమైన యమునా నదిలోనే పూజలు చేయాల్సి వస్తోందన్నారు. యుమునా నది ఘాట్ వద్ద పూజలు చేయనున్నట్లు ప్రకటించిన మోదీ.. ఆ తర్వాత అది ఆర్టిఫిషియల్‌గా నిర్మించిందని తెలుసుకొని తన స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేసేందుకు వెళ్లిపోయారని విమర్శించారు.
బుధవారం బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో నిర్వహించిన తొలి ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. బిహార్‌లో నితీశ్‌కుమార్‌ను ముందుంచి బీజేపీ రిమోట్ కంట్రోల్ సర్కారును నడుపుతున్నదని అన్నారు. 20 ఏండ్లు పాలించినా రాష్ట్రానికి నితీశ్‌కుమార్ ఏమీచేయలేదని ఆరోపించారు. ‘‘నితీశ్‌కుమార్‌ను బీజేపీ వాడుకుంటున్నది. అత్యంత వెనుకబడిన ప్రజల గొంతును వారు వింటారనుకుంటే అది పొరపాటే. బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి సామాజిక న్యాయంతో పనిలేదు” అని పేర్కొన్నారు.
జాబ్‌లు ఇవ్వలేక రీల్స్‌కు అడిక్ట్ చేశారు..
చౌకైన ఇంటర్నెట్తో పేదలకు సోషల్ మీడియాను కూడా అందుబాటులోకి తెచ్చామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘‘టెలికాం రంగంలో ఒక వ్యాపార సంస్థ గుత్తాధిపత్యాన్ని అనుమతించానని మోదీ ఎందుకు వెల్లడించలేదు. ప్రజలు రీల్స్, ఇన్‌స్టాగ్రామ్‌కు బానిసలు కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఆయన ఉద్యోగాలు ఇవ్వలేడు” అని వ్యాఖ్యానించారు.
