
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యకర్తల ఎదుట కంటతడి
ధర్మపురి, వెలుగు: బీఆర్ఎస్ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచాయని, దళితబంధు స్కీంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా తమ ఓటమికి కారణమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓటమి తర్వాత జరిగిన సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను చూసిన కొంతమంది మహిళా కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు. ‘మన పార్టీ వాళ్లే మనకు అన్యాయం చేశారన్నా..’ అంటూ పట్టుకుని ఏడ్వడంతో కొప్పుల సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటి ఎన్నికల ఫలితాలు తమకు కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటివేనన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో ఆరు నెలలు వేచి చూడాలని, ఆ తర్వాత ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతామని కొప్పుల చెప్పారు.