ద్రవ్యలోటు ఆందోళనకరం .. మధ్యంతర బడ్జెట్​పై ప్రతిపక్షాల అసంతృప్తి

ద్రవ్యలోటు ఆందోళనకరం .. మధ్యంతర బడ్జెట్​పై ప్రతిపక్షాల అసంతృప్తి

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. పెరుగుతున్న ద్రవ్యలోటు ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్  నేత మనీశ్  తివారీ అన్నారు. నిర్మల మధ్యంతర బడ్జెట్  ప్రశేశపెడుతున్న సమయంలోనే మీడియాతో తివారీ మాట్లాడారు. ఈ ఏడాది రూ.18 లక్షల కోట్ల ఆర్థిక ద్రవ్యలోటు ఉన్నట్లు నిర్మల ప్రవేశపెట్టిన అంకెలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఆయన వ్యాఖ్యానించారు.

బడ్జెట్ లో రాజకీయం తప్ప, సామాన్యుడికి ఉపయోగపడేది ఏమీ లేదని ఛత్తీస్ గఢ్  కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి సచిన్  పైలట్  అన్నారు. జైపూర్ లో జరుగుతున్న సాహిత్య వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని పొగడడం తప్ప సామాన్యులను నిర్మల దృష్టిలో పెట్టుకోలేదని విమర్శించారు. రైతులు, యువతకు ఈ బడ్జెట్ తో సంబంధమే లేదని ఆయన ఫైర్  అయ్యారు. నిర్మల బడ్జెట్  పనికిమాలినదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్​ అఖిలేష్  యాదవ్  అన్నారు. అది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్ లో అభివృద్ధే కనిపించనపుడు అది ఉపయోగం లేని బడ్జెటే అవుతుందని అఖిలేష్  మండిపడ్డారు.

లోక్ సభ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కేంద్ర ప్రభుత్వం వద్ద చాలినన్ని నిధులు ఉండేలా చూసుకోవడానికే ఈ బడ్జెట్  తయారు చేశారని కాంగ్రెస్  ఎంపీ కార్తి చిదంబరం ఎద్దేవా చేశారు. తమను తాము పొగుడుకోవడం, ప్రశంసించుకోవడం తప్ప సామాన్యులకు ఉపయోగపడేదీ ఏదీ బడ్జెట్ లో లేదని ఆయన విమర్శించారు. ఎట్టకేలకు దేశంలో ప్రజలు, మహిళలు, యువత, రైతులు ఉన్నట్లు కేంద్రం గుర్తించిందని శివసేన (ఉద్ధవ్  బాల్ ఠాక్రే వర్గం) చీఫ్​ ఉద్ధవ్  ఠాక్రే అన్నారు. మోదీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్  అని, నిర్మల ఎంతో బరువైన హృదయంతో ఈ బడ్జెట్  ప్రవేశపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.