- నేడు, రేపు అతిభారీ వర్షాలు
- 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
- ఏపీలో కల్లోలం రేపుతున్న తీవ్ర తుఫాన్
హైదరాబాద్/శంషాబాద్, వెలుగు:మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై బుధవారం తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం, మంగళవారం పెద్దగా ప్రభావం లేకపోయినా.. ప్రస్తుతం అది తీవ్ర తుఫాన్‌గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
బుధవారానికిగానూ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్సహా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. ఇక, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న ఐఎండీ.. ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ సిటీలో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని, అప్పుడప్పుడు తీవ్రవర్షపాతం నమోదయ్యేందుకు ఆస్కారం ఉందని వెల్లడించింది. గురువారం కూడా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది.
ఏపీ తీర ప్రాంతాల్లో అలజడి..
మొంథా తీవ్ర తుఫాన్ ధాటికి ఏపీలోని విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతాలను తుఫాన్ వణికిస్తున్నది. కోనసీమ జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి. కాకినాడ, యానాం తీర ప్రాంతాల్లో ఉప్పెన వచ్చే ప్రమాదం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెబుధవారానికి అలల ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం తీవ్ర తుఫాన్ గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్నదని, మచిలీపట్నానికి 50 కిలోమీటర్లు, కాకినాడకు 130 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
35 విమానాలు రద్దు
మొంథా తుఫాన్ ప్రభావంతో శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన 18 విమానాలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవం నుంచి శంషాబాద్ రావాల్సిన 17 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎయిరిండియా విమానాలు ఐదు ఉండగా, ఇండిగో విమానాలు 30 ఉన్నాయి. మొంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయని, ప్రయాణికులు ఎయిర్ లైన్స్ అధికారులను సంప్రదించి తర్వాత ఎయిర్పోర్ట్ కు రావాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో మోస్తరు వర్షాలు..
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా గుండ్ల మాచనూరులో 3.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్‌లో 3.1 సెం.మీ., కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో 2.8, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 2.8, వెల్టూరులో 2.6, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 2.5, సూర్యాపేట జిల్లా చందుపట్లలో 1.7, సంగారెడ్డి జిల్లా కందిలో 1.7 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలోని శివరాంపల్లిలో 1.5 సెం.మీ. వర్షం కురిసింది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, హిమాయత్‌నగర్, హైదర్‌నగర్, చార్మినార్‌లో 1.2 సెం.మీ., ఉప్పల్‌లో 1.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
