ఫుడ్ బిజినెస్ దుమ్ము రేపుతోంది..ఈ ఏడాది రూ.6.47 లక్షల కోట్ల మార్కెట్..2030కి డబుల్!

ఫుడ్ బిజినెస్ దుమ్ము రేపుతోంది..ఈ ఏడాది రూ.6.47 లక్షల కోట్ల మార్కెట్..2030కి డబుల్!
  • వృద్ధికి అపార అవకాశాలు 
  •  రూ. 10.37 లక్షల కోట్లకు ఫుడ్​ ఇండస్ట్రీ మార్కెట్  సైజు
  • 2030 నాటికి చేరుకుంటుందని అంచనా
  • ఈ ఏడాది దీని విలువ రూ.6.47 లక్షల కోట్లు
  • రెట్టింపు కానున్న ఆర్గనైజ్డ్​ సెక్టార్ వృద్ధి 
  • స్విగ్గీ, కెర్నీ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ:  మనదేశ ఆహార సేవల మార్కెట్ సైజు 2030 నాటికి 125 బిలియన్ డాలర్లను (దాదాపు రూ. 10.37 లక్షల కోట్లు) దాటుతుందని ఒక రిపోర్ట్​ వెల్లడించింది. ఆర్గనైజ్డ్​ సెక్టార్​ ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపై, అనార్గనైజ్డ్​ సెక్టార్​ను అధిగమిస్తుందని అంచనా వేసింది. ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫారమ్​ స్విగ్గీ, కెర్నీ కలిసి రూపొందించిన 'హౌ ఇండియా ఈట్స్' రిపోర్ట్​ ప్రకారం, 2025లో దేశంలో ఆహార సేవల మార్కెట్ విలువ రూ. 6.47 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. 

2019లో  ఇది రూ. 4.06 లక్షల కోట్లు ఉంది. 2030 నాటికి రూ. 10.37 లక్షల కోట్లు దాటుతుందని రిపోర్ట్​ పేర్కొంది. ఆహార సేవల మార్కెట్ మొత్తం వృద్ధిలో 60 శాతానికిపైగా వాటాకు ఆర్గనైజ్డ్​ సెక్టారే దోహదపడుతోంది. తలసరి జీడీపీ పెరుగుతున్న కొద్దీ ఆహార సేవలపై జనం ఖర్చు కూడా పెరుగుతోంది.  ఈ సెక్టార్​ వృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జీడీపీలో దీని వాటా 1.9 శాతంగా ఉంది. 

చైనాలో 5 శాతం, బ్రెజిల్‌‌లో 6 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. ఈ వృద్ధికి వినియోగదారుల డిమాండ్, పటిష్టమైన సరఫరా మద్దతు ఇస్తున్నాయి. క్లౌడ్ కిచెన్లు, క్విక్​ సర్వీస్​ రెస్టారెంట్లు , డెజర్ట్ పార్లర్‌‌లు సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధిస్తున్నాయి. పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్ చెల్లింపులూ మేలు చేస్తున్నాయి. 

కొత్త రుచులపై మక్కువ...

జనం కొత్త వంటకాలను ప్రయత్నించడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రతి కస్టమర్‌‌కు ఆర్డర్ చేసిన ప్రత్యేక వంటకాలలో 20 శాతం వృద్ధి ఉంది. ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ పెరగడంతో పోషకాలు ఉన్న ఆహారాల ఆర్డర్లు 2.3 రెట్లు పెరిగాయి. కొరియన్, వియత్నామీస్, మెక్సికన్ వంటలకూ గిరాకీ పెరుగుతోంది.  ‘‘గత పదేళ్లలో ఫుడ్​సర్వీస్​ ఇండస్ట్రీ ఎంతగానో ఎదిగింది. కస్టమర్లు భారతీయ, ఇటాలియన్ వంటి  వంటకాలను తక్కువ ధరల్లో కోరుకుంటున్నారు. మెక్సికన్​, వియత్నాం ఆహారానికి గిరాకీ పెరుగుతోంది. మచ్చా, బోబా టీ వంటి కొత్త వంటకాలనూ కోరుకుంటున్నారు’’ అని -స్విగ్గీ సీఈఓ ( ఫుడ్ మార్కెట్‌‌ప్లేస్) రోహిత్ కపూర్ వివరించారు.