
భారత బంగారు నగల రిటైలింగ్ పరిశ్రమలో ఆర్గనైజ్డ్ ప్లేయర్లు వేగంగా విస్తరించుకుంటున్నారని నోమురా తాజా రిపోర్ట్ పేర్కొంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి వీటి మార్కెట్ వాటా 45%కు చేరుకోనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికే జాయ్ అలూకాస్, జాస్ అలూకాస్, లలితా జ్యూవెలర్స్, మలబార్ గోల్డ్, కల్యాణ్ వంటి అనేక పెద్ద కంపెనీలు దేశవ్యాప్తంగా అనేక సంఖ్యలో షోరూమ్స్ ఏర్పాటు చేసి వ్యాపారాన్ని విస్తరించాయి. పైగా ఇవి ఇప్పటికీ వాటి విస్తరణను ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా కొనసాగిస్తూనే ఉన్నాయి.
2018 ఆర్థిక సంవత్సరంలో భారత నగల రంగం పరిమాణం 48 బిలియన్ డాలర్లుగా ఉండగా.. FY25 నాటికి ఇది 90 బిలియన్ డాలర్ల వరకు పెరిగింది. ఏడాదికి ఇది 9 శాతం చొప్పున పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే భారత రిటైల్ జ్యూవెలరీ బిజినెస్ 2033 ఆర్థిక సంవత్సరం నాటికి 150 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని నోమురా అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఆర్గనైజ్డ్ ప్లేయర్ల పెరుగుతున్న మార్కెట్ వాటా 2018 నుంచి 2025 వరకు 14% CAGRతో అభివృద్ధి చెందింది.
భారతదేశంలో అమ్మకాల తీరుతెన్నులను గమనిస్తే.. వెడ్డింగ్ జ్యూవెలరీ డిమాండ్‌లో 50–55% వాటాను కలిగి ఉన్నాయి. పైగా ఇండియాలో పెళ్లి చేసుకునే వయస్సులో ఉన్న జనాభా 2030 నాటికి 4 కోట్లకు చేరుకుంటుందని నోమురా అంచనా వేస్తోంది. వాస్తవానికి ఇదొక పెద్ద వ్యాపార అవకాశం.. అయితే ప్రస్తుతం నిరంతరం పెరుగుతున్న గోల్డ్, సిల్వర్ రేట్లు వ్యాపారాన్ని కొద్దిగా దెబ్బతీస్తున్నాయనే వాదన కూడా వ్యాపారుల నుంచి వినిపిస్తోంది. మరో పక్క పెరుగుతున్న ఆదాయ స్థాయిలు డైలీ వేర్, ఫ్యాషన్ జువెలరీ విభాగ వృద్ధికి తోడ్పడుతున్నాయి.
అధిక బంగారం ధరల సవాళ్లను ఎదుర్కోవటానికి EMI స్కీమ్స్, పాత బంగారం మార్చుకునే ఆఫర్లు, తేలికపాటి డిజైన్లు వంటి కొత్త సిద్ధాంతాలను కంపెనీలు ప్రస్తుతం బిజినెస్ పెంచుకునేందుకు అవలంభిస్తున్నాయి. దీనికి తోడు ఈ కామర్స్ విస్తరణ కూడా టైర్ 2, టైర్ 3, టైర్ 4 నగరాల్లో కస్టమర్లకు సంస్థలను చేరువ చేస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలపైన ఆధారపడిన ప్రామాణిక ప్లేయర్లు వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటున్నాయి.