పత్తి రైతులను ముంచుతున్నమధ్యవర్తులు

పత్తి రైతులను ముంచుతున్నమధ్యవర్తులు

హైదరాబాద్​, వెలుగువిత్తన (సీడ్​) పత్తి రైతులను ఆర్గనైజర్లు (మధ్యవర్తులు) ముంచేస్తున్నారు. సిండికేట్​గా మారి కమీషన్ల రూపంలో వందల కోట్లు దండుకుంటూ దగా చేస్తున్నారు. కంపెనీలు ఇస్తున్న దానికి రెట్టింపు వడ్డీతో రైతుల నడ్డి విరుస్తున్నారు. పండిన విత్తనాలకైనా సరిగ్గా డబ్బులు ఇస్తున్నారా అంటే అదీ లేదు. సగం సగం పైసలిస్తూ నిలువునా దోచేస్తున్నారు. సీడ్స్​ బాగా రాలేదన్న సాకుతో ధరల్లో కోతలు పెడుతున్నారు. పెట్టుబడి డబ్బులు కట్టకపోతే రైతుల భూములను తాకట్టు పెట్టేసుకుంటున్నారు. దీంతో నష్టం రాకుండా.. ఆర్గనైజర్లు లేకుండా కంపెనీలే నేరుగా ఒప్పందం చేసుకోవాలని ఎప్పటి నుంచో రైతులు కోరుతున్నారు. కానీ, రాజకీయ ఒత్తిళ్లతో సీడ్​ కంపెనీలు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఆ ప్రయత్నాలు చేసినా రాజకీయ పలుకుబడితో కొన్ని సీడ్​ కంపెనీలు అడ్డుపడుతున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. రైతులతో నేరుగా ఒప్పందం చేసుకుంటే ఎక్కువ ఖర్చు, శ్రమ ఉంటాయన్న కారణంతోనే కంపెనీలు ముందుకు రావట్లేదంటున్నారు.

నడిగడ్డ మెయిన్​ అడ్డా

సీడ్​ పత్తి సాగుకు మెయిన్​ అడ్డా ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని నడిగడ్డ ప్రాంతం. అక్కడ దాదాపు 50 వేల ఎకరాల్లో 30 వేల మంది దాకా రైతులు పంటను సాగు చేస్తున్నారు. పత్తి సీడ్​ కంపెనీలకు ప్రధాన ఆధారం నడిగడ్డ రైతులే.

కమీషన్​.. వడ్డీ దందా

ఒక్కో ఎకరంలో దాదాపు 500 కిలోల దాకా విత్తనాల దిగుబడి వస్తోంది. ఒక్కో కిలోకు కంపెనీలు రూ.490 నుంచి రూ.510 వరకు చెల్లిస్తుంటాయి. అంతేకాదు, రైతులకు పెట్టుబడి రూపంలో ఒక రూపాయి వడ్డీకే రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు రుణాలిస్తున్నాయి. దాన్నే ఆసరగా చేసుకున్న ఆర్గనైజర్లు అటు కమీషన్​తో పాటు ఇటు వడ్డీ రూపంలో రైతులను దోచేస్తున్నారు. విత్తన రేటులో రూ.100 కమీషన్​ తీసుకుంటూ రైతులకు నష్టం చేస్తున్నారు. కంపెనీలు ఒక రూపాయి వడ్డీకే రుణాలిస్తున్నా.. దాన్ని రూ.2కు పెంచి రైతులను ముంచేస్తున్నారు. మామూలుగా విత్తన పంట డిసెంబర్​లో చేతికి వస్తుంటుంది. ఆ మొత్తం పంటను ఆర్గనైజర్లకే రైతులు అప్పజెబుతారు. ఆ టైంలో ఆర్గనైజర్లు రైతులకు సగం డబ్బే ఇస్తారు. మిగతా సగం సీడ్​ జెర్మినేషన్​ టెస్టులు చేసిన తర్వాత ఇస్తారు. దానికి దాదాపు 6 నెలల టైం పడుతుంది. టెస్టులో పాజిటివ్​ రిజల్ట్​ వస్తేనే.. రైతుకు ఆ మిగతా సగం డబ్బు వచ్చేది. లేదంటే ఒక్కపైసా కూడా ఇవ్వరు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే జై

ఆర్గనైజర్లకు రాజకీయ నేతల అండ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఏం చేయలేకపోతున్నామని పోలీసులు, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆర్గనైజర్లంతా ఓ సిండికేట్​గా మారి.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులకు జై కొడుతుండడంతో అధికార పార్టీ నేతలూ మౌనంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయ్. గత ప్రభుత్వంలో మహబూబ్​నగర్​ జిల్లా ఎస్పీ ఆర్గనైజర్లపై కఠినంగా వ్యవహరించారు. రైతులతో కంపెనీలే నేరుగా ఒప్పందం చేసుకునేలా ఆయన కృషి చేశారు. కానీ, ఆర్గనైజర్లు ఓ మంత్రి సాయంతో ఆ ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్​ఫర్​ చేయించారన్న ఆరోపణలున్నాయి.

మంత్రికి సవాలుగా మారిన ఆర్గనైజర్లు

సీడ్​ పత్తి ఎక్కువగా సాగవుతున్న మహబూబ్​నగర్​.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి సొంత జిల్లా. అక్కడే ఆర్గనైజర్ల సమస్య ఎక్కువగా ఉండడంతో ఆయనకు సవాల్​గా మారింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఆర్గనైజర్ల ప్రమేయం లేకుండా చూస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి చొరవ తీసుకొని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.

జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకూ తెలుసు

ఆర్గనైజర్లు రైతులను మోసం చేస్తున్నారు. ఏటా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు కమీషన్​ రూపంలో తీసుకుంటున్నారు. రైతులకు వాళ్లే పెట్టుబడి సాయం చేస్తున్నారు. అనుకున్నట్టుగా సీడ్​ పంట బాగా రాకపోతే రైతుల భూములను తాకట్టు పెట్టేసుకుంటున్నారు. దీన్ని ఎన్నోసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్​, వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఎవరూ పట్టించుకోవట్లేదు.

– రంజిత్​ కుమార్​, నడిగడ్డ రైతు హక్కుల పోరాట నాయకుడు