ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
  • ఐటీడీఏ పరిధిలో సగంలోనే నిలిచిన 3,276 ఇండ్ల నిర్మాణాలు 
  • నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు అందని వైనం 
  • షురూ చేసేందుకు రూ.3కోట్ల జిల్లా మినరల్ ఫండ్స్ ఇచ్చిన కలెక్టర్​

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోనూ డబుల్​బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలు సగంలోనే ఆగిపోయాయి. ఐటీడీఏ పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్​ జిల్లాల్లో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్​ విభాగానికి 7,503 ఇండ్లను కేటాయించారు. కానీ వివిధ దశల్లో 3,276 ఇండ్ల నిర్మాణం సగంలోనే నిలిచిపోయాయి. ఇప్పటివరకు 4,227 ఇండ్లు పూర్తయినట్లు ఐటీడీఏ నివేదికలు చెబుతున్నాయి. 447 ఇండ్లు టెండర్​స్థాయిలో ఉండగా..1809 నిర్మాణంలో ఉన్నాయి. మరో 1091 ఇండ్లకు ఇంకా పనులు ప్రారంభం కాలేదు. పూర్తయిన ఇండ్లలో చాలావరకు కరెంట్, వాటర్, ఇతర మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులకు కేటాయించలేదు.  ఒక్క భద్రాచలం ఐటీడీఏలోనే ఇలా ఆగిన బిల్లులు రూ.2.50కోట్లు వరకు ఉన్నాయి. భద్రాచలంలో నిలిచిన 250 ఇండ్ల నిర్మాణాలను తిరిగి ప్రారంభించేందుకు కలెక్టర్​ జిల్లా మినరల్స్​ ఫండ్స్​ నుంచి రూ.3కోట్లు కేటాయించారు. 

చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు 

ఐటీడీఏ పరిధిలో నిర్మిస్తున్న డబుల్​బెడ్రూం ఇండ్లకు బిల్లులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. బిల్లులు సరిగా రాకపోవడం, పెరిగిన ముడిసరుకుల ధరలతో తమపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ అప్పో సప్పో తెచ్చి ఇండ్లు కడితే.. సకాలంలో బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీల కడుతున్నామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. 

రూ.3 కోట్లు కేటాయించిన కలెక్టర్​

ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5.04లక్షలు ఇస్తుండగా మరో రూ.2లక్షల వరకు అదనపు భారం పడుతోందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీంతో భద్రాచలంలో నిలిచిన 250 డబుల్ బెడ్​ రూం ఇళ్ల నిర్మాణాలను తిరిగి షురూ చేసేందుకు కలెక్టర్​ డిస్ట్రిక్ట్ మినరల్స్ ఫండ్స్ నుంచి రూ.3కోట్లు కేటాయించారు. ఒక్కో ఇంటికి అదనంగా రూ.1.20లక్షలు వెచ్చించి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే  బెనిఫిషర్లకు కేటాయించాలని సూచించారు. 

దారిమళ్లిన ‘డబుల్’ ఇసుక 

భద్రాచలంలో డబుల్​ బెడ్రూం ఇండ్లకు కేటాయించిన ఇసుకను కాంట్రాక్టర్లు, ట్రాక్టర్ల యజమానులు కుమ్మక్కై దారి మళ్లించారు. భద్రాచలం ఐటీడీఏ వెనుక ఉన్న ఆగిన డబుల్​బెడ్రూం ఇండ్లను పూర్తి చేసేందుకు కలెక్టర్​ డిస్ట్రిక్ట్ మినరల్స్ ఫండ్స్ నుంచి రూ.3కోట్లు రిలీజ్​ చేశారు. పనులకు అవసరమైన ఇసుకను తోలుకునేందుకు తహసీల్దారు నుంచి 58 కూపన్లు మంజూరు చేశారు. సోమవారం వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చి రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఇసుక తోలేందుకు భద్రాచలం ర్యాంపు నుంచి అనుమతి ఇచ్చారు. ఒక కూపన్​పై ఒక ట్రాక్టర్​ మాత్రమే తోలాల్సి ఉండగా కాంట్రాక్టర్లు, ట్రాక్టర్ల యజమానులతో కలిసి ఒక్కో కూపన్​పై నాలుగు ట్రాక్టర్ల ఇసుకను తోలారు. ఆ ఇసుకను బయట ట్రక్కుకు రూ.4వేల చొప్పున అమ్ముకున్నారు. ఇలా 58 కూపన్లపై 200కు పైగా ట్రిప్పులు తోలారు. ఈ దందాలో ఓ అధికార పార్టీ నాయకుడి హస్తం ఉన్నట్లు సమాచారం. దీంతో అధికారులు తనిఖీలు చేయడానికి ముందుకు రాలేదు. పోలీస్​ బీట్​కానిస్టేబుళ్లు వచ్చి ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నా తర్వాత వదిలేశారు. ఈ విషయం తహసీల్దారు దృష్టికి వెళ్లడంతో మధ్యాహ్నం నుంచి ఇసుక తోలకాలను ఆపేశారు. 

మావోయిస్టుల సమాచారమిస్తే రివార్డు
నక్సల్స్​ ఫొటోలతో పోస్టర్​ రిలీజ్​ చేసిన పోలీసులు

భద్రాచలం, వెలుగు: జిల్లాలో సంచరిస్తున్న మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టర్లను సోమవారం భద్రాచలం ఏఎస్పీ రోహిత్​రాజు రిలీజ్​ చేశారు. తెలంగాణ–-ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో వీరు సంచరిస్తున్నారని, వారి ఆచుకీ తెలిపిన వారికి క్యాష్​ప్రైజ్​ అందించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఒక్కొక్క మావోయిస్టుపై  రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు రివార్డులు ఉన్నాయన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు. మావోయిస్టులు కొయ్యాడ సాంబయ్య అలియాస్​ ఆజాద్​, పొట్టం సంకి అలియాస్​ అరుణ, గజేందర్​ అలియాస్ మధు, మడకం ఎర్రయ్య అలియాస్​ రాజేశ్, వెట్టి దేవ​ అలియాస్​ బాలు, కవ్వాసి కోసయ్య అలియాస్​ సందీప్​, పద్దం నందయ్య అలియాస్ రామ్​దా, మడకం కోసి అలియాస్ రజిత ఫొటోలను ఏఎస్పీ రిలీజ్​ చేశారు. కార్యక్రమంలో భద్రాచలం, దుమ్ముగూడెం సీఐలు నాగరాజు రెడ్డి, రమేశ్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో గణేశ్​నిమజ్జనం జరుపుకోవాలి
సీపీ విష్ణు ఎస్.వారియర్​

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: శాంతియుత వాతావరణంలో గణేశ్​నిమజ్జనం జరుపుకోవాలని పోలీస్​ కమిషనర్​ విష్ణు ఎస్​.వారియర్​ అన్నారు. పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం నగర గణేశ్​ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. కమిటీ నిర్వాహకులకు పోలీసులు సెక్టారు వారీగా అందుబాటులో ఉంటారన్నారు. నిమజ్జనం రోజు సౌండ్​ సిస్టమ్​, డీజేలు ఉపయోగించవద్దన్నారు. కార్యక్రమంలో ఏడీసీపీ సుభాశ్​చంద్రబోస్​, ఏసీపీలు రామోజీ రమేశ్, ఆంజనేయులు, వినోద్​ లహోటీ, విద్యాసాగర్​, జైపాల్​రెడ్డి, తహసీల్ధార్​ శైలజ పాల్గొన్నారు.

సాగర్ చివరి ఆయకట్టుకు నీరందించాలి

వైరా, వెలుగు: సాగర్​చివరి ఆయకట్టుకు సాగునీరందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం బృందం, సాగర్ ఆయకట్టు రైతులతో కలిసి సోమవరం సమీపంలోని మైనర్ సాగర్ కాలువపై పరిశీలించారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి లక్షల క్యూసెక్కులు సముద్రం పాలవుతున్నా.. ఖమ్మం జిల్లాలో సాగర్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందటం లేదన్నారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని, ఇరిగేషన్ అధికారులు స్పందించి సోమవరం మైనర్ కాలువకు రిపేర్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చెరుకుమల్లి కుటుంబరావు, రైతులు చింతనిప్పు నరిసింహరావు, కోటయ్య, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, వెంకయ్య, కృష్ణ, నరేంద్ర పాల్గొన్నారు.

సింగరేణి యాజమాన్యం క్షమాపణ చెప్పాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో ఖాళీగాఉన్న జూనియర్​ అసిస్టెంట్​పోస్టుల భర్తీకి సింగరేణి యాజమాన్యం ఆదివారం ఎగ్జామ్​ నిర్వహించింది. ప్రశ్నాపత్రంలో ప్రధానమంత్రి మోడీ, సీఎం కేసీఆర్​పై అడిగిన ప్రశ్నలలో కేసీఆర్​కు ఇచ్చిన గౌరవం, మోడీకి ఇవ్వలేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు.  ఓ ప్రశ్నలో  కేసీఆర్​ను ‘శ్రీ’ తో గౌరవంగా సంబోధించగా, పీఎం మోడీ కి ‘శ్రీ’ వాడకపోవడం ఆయన పట్ల వివక్షేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సింగరేణి యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. 

యువకుడిపై రేప్ కేసు

అశ్వారావుపేట, వెలుగు: ఓ యువతిని ప్రేమించి మోసం చేసిన యువకుడిపై పోలీసులు రేప్​కేసు నమోదు చేశారు. ఎస్సై అరుణ తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేట టౌన్ లోని బండి సుబ్రహ్మణ్యం వీధికి చెందిన ఉప్పుతల నాగు ఓ యువతిని ప్రేమిస్తున్నాని చెప్పి మాయమాటలతో లోబరుచుకొన్నాడు. అనంతరం వారింటికి వెళ్లి గొడవ చేసి యువతిని, ఆమె తల్లిని చంపుతానని బెదిరించాడు. భయభ్రాంతులకు గురైన యువతి సెల్ఫీ వీడియో తీసి ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్ కు తరలించారు. సోమవారం ఆ యువతి ఫిర్యాదు చేయడంతో నాగుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

మణుగూరు డీఎస్పీగా రాఘవేంద్రరావు

మణుగూరు, వెలుగు: మణుగూరు డీఎస్పీగా ఎస్.వి.రాఘవేంద్రరావు సోమవారం చార్జ్​ తీసుకున్నారు. స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న రాఘవేంద్రరావును మణుగూరు డీఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇక్కడ ఏఎస్పీగా పనిచేసిన డా.శబరీశ్​బదిలీపై వెళ్లారు. 

ఘనంగా గురుపూజోత్సవం 

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పీవో గౌతమ్​ పోట్రు నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్​ ఫొటోకు పూలమాల  వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ, హాస్టళ్లలో వారం రోజుల పాటు స్వచ్ఛ ఆశ్రమ, వసతి గృహ కార్యక్రమాలుపై వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు. 

చండ్రుగొండ, వెలుగు: చండ్రుగొండ లో సోమవారం గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక జడ్పీ హైస్కూల్ లో  ప్రజాప్రతినిధులు టీచర్ల ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో సత్యనారాయణ, ఎస్ ఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ వెంకటరెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్వరావు, ఉపసర్పంచ్ బాబూరావు పాల్గొన్నారు.

పాల్వంచ, వెలుగు: పాల్వంచలోని  నవభారత్ స్కూల్​లో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కల్చరల్​ప్రోగ్రామ్స్​ఆకట్టుకున్నాయి. చీఫ్​గెస్ట్​గా నవభారత్ వైస్ ప్రెసిడెంట్ వై.శ్రీనివాస మూర్తి 
హాజరయ్యారు. 

టేకులపల్లిలో స్వచ్ఛ గురుకులం 

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం టేకులపల్లి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్, కాలేజీ  వద్ద స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఇటీవల వరంగల్ లో జరిగిన తెలంగాణ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కప్ లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు జె.నవ్య,సింధు ప్రియలను కలెక్టర్ అభినందించి మెడల్ అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.గురుకులాల సంస్థ జాయింట్ సెక్రటరీ  
కె. శారద, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, కార్పొరేటర్ ఎన్. కోటేశ్వరరావు, ఆర్సీవో  ప్రత్యూష పాల్గొన్నారు. 

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్

పాల్వంచ, వెలుగు: అర్హులైన ప్రతిఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ ఇస్తోందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం పాల్వంచ మండలంలోని  పలు గ్రామాలకు చెందిన 920 మంది లబ్ధిదారులకు సోమవారం పింఛన్​కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ బరపటి వాసు, ఎంపీపీ సరస్వతి, వైస్ ఎంపీపీ గురవ య్య, సొసైటీ వైస్ చైర్మన్ కనకేశ్, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు ఎం.రాజు గౌడ్, విశ్వనాథం, సొసైటీ డైరె క్టర్ నారాయణ, సర్పంచుల సంఘం అధ్యక్షులు రవీందర్ తదితరులు పాల్గొ న్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్​చెక్కులు పంపిణీ చేశారు. 

దళితబంధు దేశానికి ఆదర్శం

వైరా, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్​ ప్రభుత్వం చేట్టిన దళితబంధు పథకం దేశానికి ఆదర్శమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్,  ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ​జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్​ అన్నారు.  సోమవారం వైరా రైతు వేదికలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు అధ్యక్షతన దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూపాయి పెట్టుబడి లేకుండా లబ్ధిదారులకు యూనిట్లు  అందించిన ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మార్క్​ఫెడ్​స్టేట్​వైస్​ చైర్మన్​ బొర్రా రాజశేఖర్, మున్సిపల్​చైర్మన్​ జైపాల్, డీఆర్వో శిరీష, తహసీల్దార్​అరుణ,  వైరా ఏఎంసీ చైర్మన్​ రత్నం,  టీఆర్ఎస్​నాయకులు మోహన్​ రావు, దళిత బంధు లబ్ధిదారులు 
పాల్గొన్నారు.

చనిపోయి ఏడుగురికి పునర్జన్మ

బ్రెయిన్​డెడ్​ అయిన వ్యక్తి నుంచి అవయవాల సేకరణ

ముదిగొండ, వెలుగు: బ్రెయిన్​డెడ్​అయిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలు మరో ఏడుగురికి ప్రాణం పోశాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ముదిగొండ మండలం గంధసిరి గ్రామానికి చెందిన కొండపల్లి ఎల్లయ్య(58) కొద్దిరోజుల కింద సూర్యాపేటలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్థానిక హాస్పిటల్​లో చికిత్స అనంతరం సీరియస్​గా ఉండటంతో హైదరాబాద్​కు తరలించారు. అతని బాడీ చికిత్సకు స్పందిచకపోవడంతో ఈనెల 2న బ్రెయిన్​డెడ్​అయినట్లు డాక్టర్లు తేల్చారు. కుటుంబ సభ్యులు ఎల్లయ్య అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడంతో జీవన్ దాన్​సంస్థకు సమాచారం ఇచ్చారు. వారు ఎల్లయ్య కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివర్.. ఇతర అవయవాలను సేకరించి మరో ఏడుగురికి అమర్చారు.

కులం పేరుతో దూషిస్తూ దాడి..
కలెక్టర్​కు కేజీబీవీ పీఈటీ, స్టూడెంట్ ​ఫిర్యాదు 

ఖమ్మం టౌన్, వెలుగు: కులం పేరుతో దూషిస్తూ, తమపై దాడి చేశారని ఆరోపిస్తూ చింతకాని మండలం లచ్చగూడెం కేజీబీవీ పీఈటీ, ఇంటర్​స్టూడెంట్​కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. గత నెల 23న జరిగిన ఈ ఘటనపై సోమవారం కలెక్టరేట్​లో జరిగిన గ్రీవెన్స్​లో కలెక్టర్​కు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం... చింతకాని మండలం లచ్చగూడెంలోని కేజీబీవీలో పనిచేస్తున్న ఓ పీఈటీ స్థానికంగా రూమ్ ​రెంట్​కు తీసుకొని ఉంటున్నారు.  గత నెల 23న కేజీబీవీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ స్టూడెంట్​ను ఆమె తండ్రి స్కూల్​లో చేర్చేందుకు రాగా సాయంత్రం కావడంతో పీఈటీ వద్ద ఉంచి వెళ్లాడు. కేజీబీవీ ఎస్వో, ఎస్ఎంసీ చైర్మన్, కొందరు గ్రామస్తుల సహకారంతో పీఈటీ ఇంటికి వచ్చి స్టూడెంట్ ను, పీఈటీని వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టారు.

ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు చింతకాని పోలీస్​స్టేషన్​కు వెళ్తే ఎస్ఐ తమ కంప్లయింట్​ను చింపేశాడని, రాత్రి 9గంటల వరకు స్టేషన్​లో ఉంచుకొని తర్వాత చైల్డ్ హెల్ప్ లైన్ వారికి అప్పగించారని బాధితులు కలెక్టర్​కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సకల జనుల పార్టీ జాతీయ లీడర్ బాపట్ల రామ్మూర్తి, కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ కన్వీనర్​ కె.మధు, గిరిజన సమాఖ్య లీడర్ అజ్మీరా కిషన్ నాయక్ ల ఆధ్వర్యంలో కలెక్టర్ కు బాధితులు గ్రీవెన్స్ లో పిర్యాదు చేశారు. 

మణుగూరు డీఎస్పీగా రాఘవేంద్రరావు

మణుగూరు, వెలుగు: మణుగూరు డీఎస్పీగా ఎస్.వి.రాఘవేంద్రరావు సోమవారం చార్జ్​ తీసుకున్నారు. స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న రాఘవేంద్రరావును మణుగూరు డీఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇక్కడ ఏఎస్పీగా పనిచేసిన డా.శబరీశ్​బదిలీపై వెళ్లారు. 

ఖమ్మంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు పర్యటన

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం పర్యటించారు. బురహాన్ పురం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వరుసగా ఎన్ఎస్టీ రోడ్డు బాలాజీ నగర్, నరసింహ స్వామి దేవాలయం, రేవతీ సెంటర్.. తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన గణేశ్​ మండపాలను సందర్శించారు. ఆయన వెంట మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పార నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​ లక్ష్మీ ప్రసన్న, ఖమ్మం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, టీఆర్ఎస్​ నాయకులు తోట రామారావు, తోట రమేశ్, సాయి కిరణ్ ఉన్నారు. 

‘స్మార్ట్​’ టీచింగ్​ తో పిల్లల్లో ఆలోచనా శక్తి 
కలెక్టర్​ అనుదీప్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: స్మార్ట్​ టీవీల ద్వారా విద్యాబోధనతో పిల్లల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందని కలెక్టర్​ అనుదీప్​ అన్నారు. కలెక్టరేట్​లో సోమవారం ఎన్ఆర్ఐ ఫౌండేషన్​ ద్వారా 23 డిజిటల్​ స్మార్ట్​ టీవీలను మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారులకు కలెక్టర్​ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్​ టీవీల ద్వారా డిజిటల్​ విద్యాబోధనతో కథలు, ఆటపాటలు, ఇతరత్రా ప్రోగ్రాంలు పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు. ఎన్​ఆర్​ఐ ఫౌండేషన్​ జిల్లా అధ్యక్షుడు బాబు బయ్యన్న మాట్లాడుతూ 50శాతం ప్రభుత్వం సాయం చేస్తే 50శాతం సంస్థ భరిస్తూ మిగిలిన అంగన్​వాడీ కేంద్రాలకు స్మార్ట్​ టీవీలను అందజేస్తామన్నారు. 
ఆస్తి పంచాలని నా కొడుకు వేధిస్తుండు.. 

ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ నా ఆస్తిపై నా చిన్న కొడుకు కన్నేసి ఇబ్బందులు పెడుతున్నాడని భద్రాచలానికి చెందిన త్రినాథ నంబూద్రి కుమార్​కలెక్టర్​కు గ్రీవెన్స్​లో ఫిర్యాదు చేశారు. కొత్తగూడెం కలెక్టరేట్​లో సోమవారం గ్రీవెన్స్​నిర్వహించారు. ఇద్దరు కొడుకులకు వ్యాపారానికి అవసరమైన డబ్బులు ఇచ్చానని, చిన్న కొడుకు వ్యాపారంలో బాగానే సంపాదించినప్పటికీ ఆస్తిని పంచాలని వేధిస్తున్నాడని వాపోయారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ గ్రీవెన్స్​లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. డీఆర్వో అశోక్​ చక్రవర్తి, డీఆర్డీవో మధుసూదనరాజు, డీపీవో రమాకాంత్​, పాల్గొన్నారు. 

తహసీల్దార్లు ఎందుకు అందుబాటులో లేరు... 

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జడ్పీ హాల్​లో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. కలెక్టర్​మాట్లాడుతూ గ్రీవెన్స్​డేలో వీడియో కాన్ఫరెన్స్​లో తహసీల్దార్​లు ఎందుకు అందుబాటులో ఉండటం లేదని ప్రశ్నించారు. కామేపల్లి మండలం జాస్తిపల్లి విలేజ్ కు చెందిన దమ్మలపాటి శేషమ్మ తన కొడుకు వెంకటనారాయణ, కూతురు ఎల్లంకి సుజాత, తహసీల్దార్​కృష్ణ, ఎంపీటీసీ నరసింహారావు, మాజీ సర్పంచ్ శివయ్య లు తన ఇంటికి వచ్చి నన్ను బెదిరించడంతో పాటు మోసగించి నాలుగున్నర ఎకరాల భూమి రాయించుకున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్.. ఎందుకు రిజిస్ట్రేషన్​చేశారని తహసీల్దార్​ను ఫోన్ లో ప్రశ్నించారు. మధిర నియోజకవర్గం మడుపల్లి లో లెదర్ పార్క్ కోసం కేటాయించిన 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని అంబేడ్కర్​లెదర్ పార్క్ సొసైటీ సభ్యుల కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్ లో అడిషనల్​కలెక్టర్లు మధుసూదన్, స్నేహలత, ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా పాల్గొన్నారు.

బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ గా నంబూరి

సత్తుపల్లి, వెలుగు: బీజేపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ గా నంబూరి రామలింగేశ్వరరావు నియమితులయ్యారు. సోమవారం ప్రకటించిన పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ల జాబితాలో తనకు అవకాశం కల్పించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తమిళనాడు సహా ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఇంచార్జి రమేశ్​కు నంబూరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. 

బండి సంజయ్​ను కలిసిన గల్లా

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో తమ్మినేని క్రిష్ణయ్య హత్య, ఇతర రాజకీయ అంశాలపై చర్చించారు. తమ్మినేని క్రిష్ణయ్య హత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించేలా ఒత్తిడి చేయాలని బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు గల్లా తెలిపారు. సంజయ్​ను కలిసినవారిలో దొంగల సత్యనారాయణ, నరేందర్​రావు, శ్యాంరాథోడ్, రుద్రప్రదీప్​ ఉన్నారు.