- వెస్ట్‌సైడ్ గ్రోత్ కారిడార్‌లో రవాణా వ్యవస్థ బలోపేతం
- డీపీఆర్ రెడీ చేస్తున్న హెచ్ఎండీఏ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ కారిడార్‌ను నార్సింగిలోని ఔటర్‌రింగ్ రోడ్‌కు లింక్‌చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు హెచ్ఎండీఏ అడుగులు వేస్తోంది. ఈ ప్లాన్‌తో వెస్ట్ సిటీలో ముఖ్యంగా నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్గ్రోత్కారిడార్లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) అధికారులు ప్రత్యేకంగా ఒక ప్లాన్రూపొందించారు. దీని ప్రకారం ఓ ఆర్ఆర్ ఎగ్జిట్ 18ఏ నుంచి నార్సింగి ఓఆర్ఆర్ వరకూ కొత్తగా ఫ్లైఓవర్‌తో పాటు సర్వీస్‌రోడ్లు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలో దీనికి సంబంధించిన డీపీఆర్సిద్ధం చేసి 24 నెలల్లో పనులు పూర్తిచేయాలని హెచ్ ఎండీఏ నిర్ణయించింది.
ప్రాజెక్టు స్వరూపం ఇలా...
నార్సింగి మంచిరేవుల వద్ద ఉన్న ఓఆర్ఆర్ఎగ్జిట్ నంబర్ 18ఏ ఇంటర్‌ఛేంజ్ నుంచి మూసీ వెంట నార్సింగి రింగ్ రోడ్ వరకు కొత్త సర్వీస్ రోడ్డు వేస్తారు. ఓఆర్ఆర్కి రెండువైపులా సర్వీస్ రోడ్లను కలుపుతూ మూసీపై ఒక భారీ వంతెన నిర్మిస్తారు. ప్రాజెక్టును ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ) మోడల్‌లో చేపట్టనున్నారు.
ఎంపికైన సంస్థలే ప్రాజెక్టు వ్యయాన్ని భరించి మూడు నెలల్లో డీపీఆర్ రెడీ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఐదేండ్ల పాటు నిర్వహణ సంస్థనే పర్యవేక్షణ చేస్తుంది. డీపీఆర్పూర్తయిన రెండున్నరేండ్లలోపు ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కాకపోతే, కన్సల్టెంట్ ఈ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది.
ప్రత్యేకత ఏంటంటే....
ప్రధాన క్యారేజ్‌వేలపై ఒత్తిడి తగ్గించి, స్థానిక ట్రాఫిక్ కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ లింక్వల్ల మూసీ పరివాహక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, కమర్షియల్రంగాలు మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు మరింత పెరుగుతాయి.
