అన్నీ గుంతలే వానలకు పాడైన ఔటర్ రోడ్లు

అన్నీ గుంతలే  వానలకు పాడైన ఔటర్ రోడ్లు
  • వెహికల్స్ వెళ్లేందుకు ఇబ్బందులు
  • టోల్ వసూలు పైనే హెచ్ఎండీఏ దృష్టి 

హైదరాబాద్, వెలుగు:  సిటీ రోడ్లే కాదు.. ఔటర్ రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. ఎప్పటికప్పుడు రోడ్డు వేయాల్సి ఉన్నా హెచ్ఎండీఏ పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై గుంతలున్న చోట్ల ఒక్కోసారి సడెన్ బ్రేకులు వేయాల్సి వస్తుండటంతో  యాక్సిడెంట్లు జరిగే ప్రమాదముంది. ఇటీవల ఓఆర్ఆర్​పై 100 నుంచి120 స్పీడ్​కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోడ్లు కరాబ్​అవడంతో కొన్నిచోట్ల 80 స్పీడ్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.  ఒకటి, రెండు చోట్ల కాకుండా 158 కి.మీ మేర  సగం ఔటర్  రోడ్లపై గుంతలు పడ్డాయి. 

నిర్వహణ లోపంతోనే ఇలా.. 

హెచ్ఎండీఏ నిర్లక్ష్యంతోనే రోడ్లు కరాబైనట్లు వాహనదారులు చెబుతున్నారు. ఓఆర్ఆర్ అద్దంలా ఉందని, ట్రాఫిక్  లేకుండా ప్రయాణించేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం గొప్పులు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం గల్లీ రోడ్ల మాదిరిగా తయారైందంటున్నారు. టీఎస్​పీఏ నుంచి పటాన్ చెరు వరకు ఔటర్ ఇరువైపులా నాలుగైదు మీటర్లకు ఒక గుంత ఏర్పడింది. వెహికల్స్ నెమ్మదిగా నడుపుతూ వెళ్లాల్సి వస్తుంది. 

ఔటర్​ను అధికారులు పట్టించుకోకపోవడంతో  సర్వీసు రోడ్డుపై వెళ్లడమే బెటర్ అని పలువురు వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టోల్ వసూళ్లపై    దృష్టి పెట్టిన హెచ్ ఎండీఏ అధికారులు.. రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలానికి ముందే రోడ్డు వేయాల్సి ఉండగా వానలను సాకు చూపుతూ అధికారులు సమాధానం దాటవేస్తున్నారు. 

కొత్త సంస్థకు అప్పగింతతోనేనా?

ఓఆర్ఆర్​​ను ప్రస్తుతం హెచ్ఎండీఏ స్వయంగా పర్యవేక్షిస్తోంది. టోల్ ఫీజు వసూలు మాత్రం ఈగల్ ఇన్ ఫ్రా సంస్థ చూస్తుంది.  ఇటీవల  టోల్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్(టీఓటీ)  పద్ధతిలో లీజుకిచ్చిన సంగతి తెలిసిందే. ఐఆర్బీ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్  రూ.7,380 కోట్లకి 30ఏళ్ల పాటు లీజుకి తీసుకుంది. ఆ సంస్థ డబ్బులు చెల్లిస్తే ఏ క్షణమైనా లీజు బాధ్యతలను అప్పగించనుంది. తద్వారానే కొంతకాలంగా హెచ్ఎండీఏ రోడ్ల మరమ్మతులు చేయడం  లేదు. పబ్లిక్ నుంచి హెచ్ఎండీఏ టోల్ వసూల్ చేస్తుండగా  రోడ్ల నిర్వహణపై దృష్టి పెట్టకపోవడంపై  తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.