- రూ.48 కోట్ల నిధులతో చివరి దశ పనులు
- చెరువు కట్టపై పార్క్డెవలప్మెంట్
- కిందిభాగంలో చిరు వ్యాపారులతో ఈట్‍స్ట్రీట్ సెంటర్
- జులై నాటికి ప్రారంభించేలా అడుగులు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు టూరిజంలో తొలిసారిగా గ్రేటర్లో ఈట్స్ట్రీట్కాన్సెప్ట్తో వడ్డేపల్లి బండ్ రూపుదిద్దుకుంటోంది. చెరువు అందాలు, పచ్చని గార్డెన్, రంగురంగుల లైటింగ్, చెరువు మధ్యలో మ్యూజికల్ఫౌంటేన్తో పర్యాటకులను అలరించడంతో పాటు, సందర్శకులకు ఒకేచోట స్ట్రీట్‌ఫుడ్ అందుబాటులోకి రానుంది. చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వచ్చే జులైలో పర్యాటకుల సందర్శనకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆఫీసర్లు పనులను స్పీడప్ చేశారు.
రూ.48 కోట్లతో అభివృద్ధి పనులు..
గ్రేటర్ వరంగల్ పరిధిలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలు ఉన్నాయి. వరంగల్ – హనుమకొండ మధ్యలో ఉన్న భద్రకాళి బండ్‍ను ఇప్పటికే టూరిజం స్పాట్‍గా అభివృద్ధి చేయడంతో నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తున్నారు. ప్రస్తుతం దీనికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాజీపేట నగరం ఫాతిమా జంక్షన్‍లోని వడ్డేపల్లి చెరువును కూడా ఆధునిక బండ్‍గా మారుస్తున్నారు.
ఇందుకోసం స్మార్ట్‌సిటీ నిధుల నుంచి రూ.34.05 కోట్లు, స్టాంప్ డ్యూటీ నిధుల నుంచి మరో రూ.13.50 కోట్లు కేటాయించారు. స్మార్ట్‌సిటీ నిధులతో కట్టపై గార్డెన్, టిక్కెట్ కౌంటర్లు, టాయిలెట్లు, విద్యుద్దీపాలు, రెయిలింగ్స్వంటి పనులు చేపట్టారు. స్టాంప్స్ డ్యూటీ ఫండ్స్‌తో చెరువు మధ్యలో మ్యూజికల్ ఫౌంటేన్, కలర్‍ఫుల్ లైటింగ్, బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నారు. 2022, 2023లో భారీ వర్షాల కారణంగా వడ్డేపల్లి చెరువు కట్ట బలహీనపడింది. మరోసారి అలాంటి పరిస్థితులు వస్తే కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని ఆఫీసర్లు గుర్తించారు. అలా జరిగితే ప్రశాంత్‍నగర్ నుంచి హనుమకొండలోని కనీసం 400 కాలనీలు నీటమునిగే ప్రమాదం ఉండడంతో కట్టను మరింత బలంగా మార్చారు.
ఎమ్మెల్యే చొరవతో ఈట్ స్ట్రీట్ కాన్సెప్ట్
గ్రేటర్ వరంగల్‌లో తొలిసారిగా ఈట్ స్ట్రీట్‍కాన్సెప్ట్‍తో వడ్డేపల్లి చెరువు బండ్ ను అభివృద్ధి చేస్తున్నారు. ట్రైసిటీలో భద్రకాళి బండ్, మ్యూజికల్ గార్డెన్, పబ్లిక్ గార్డెన్, చిల్డ్రన్స్‌పార్కు, జూ పార్క్వంటి పర్యాటక ప్రదేశాలున్నా, కుటుంబాలతో వచ్చే సందర్శకులకు రుచికరమైన స్ట్రీట్‌ఫుడ్ అందించే ప్రదేశం లేదు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి చొరవతో ఆఫీసర్లు వడ్డేపల్లి బండ్‍ను ఈట్స్ట్రీట్కాన్సెప్ట్తో డెవలప్చేయాలని నిర్ణయించారు. కట్టకు ఓ వైపు చెరువు, అందులో రంగురంగుల లైటింగ్మధ్య మ్యూజికల్ ఫౌంటేన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
కిలోమీటరున్నర బండ్ కట్టపై గార్డెన్, వాకింగ్ ట్రాక్, ఫొటోలు దిగడానికి వ్యూ పాయింట్స్ ఉండనున్నాయి. కట్టకింది భాగంలోని ఫాతిమా నగర్_కేయూ 100 ఫీట్ల రోడ్డులో చిరు వ్యాపారులతో ఈట్ స్ట్రీట్‍సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం కట్టపై మధ్యమధ్యలో కిందకు వెళ్లే మెట్లు కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చిరు వ్యాపారులకు ఆర్థిక అవకాశాలు లభించడంతో పాటు, వీకెండ్లు, సెలవులు, పండుగల సమయంలో వచ్చే కుటుంబాలకు ఒకేచోట విభిన్న రకాల ఆహారం అందుబాటులో ఉండనుంది.
8 ఏండ్లలో పనులు చేయలే.. ధ్వంసమైన నిర్మాణాలు
గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్‌సిటీ పథకం కింద 2018లో వడ్డేపల్లి బండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలో పూర్తి చేయాల్సిన పనులు 2023లో ప్రభుత్వం మారే నాటికి కూడా పూర్తికాలేదు. అప్పటికే చేపట్టిన పనుల్లో దాదాపు 50 శాతం వరకు ధ్వంసమయ్యాయి. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ నిధులు రాలేదు. గడువు ముగియడంతో కొన్ని నిధులు తగ్గాయి. మొత్తంగా రూ.34 కోట్లతో చేపట్టిన పనులు మధ్యలో ఆగాయి.
ప్రస్తుతం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి చొరవ తీసుకుని పెండింగ్ స్మార్ట్‌సిటీ ఫండ్స్ వచ్చేలా చర్యలు చేపట్టారు. కాంట్రాక్టర్ బిల్లుల చెల్లింపులు పూర్తిచేయడంతో ఆగిన పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇవేగాక గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మరో రూ.13.50 కోట్లు కేటాయించడంతో ధ్వంసమైన నిర్మాణాలను తిరిగి చేపట్టడంతో పాటు కొత్త పనులకు శ్రీకారం చుట్టారు.
